పోలవరం పూర్తి కాదంతే...పొరుగు జోస్యం

Update: 2022-11-13 14:35 GMT
ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. ఇది కనుక పూర్తి అయితే వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగా కూడా ఏపీకి కొత్త కళ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ స్వరూపమే మారిపోతుంది. అయితే పోలవరం ఎంత దూరంలో ఉంది. ఎపుడు పూర్తి అవుతుంది అంటే మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. సాక్షాత్తూ ఏపీ మంత్రి అంబటి రాంబాబే పోలవరం ఎపుడు పూర్తి అన్న ప్రశ్నలను అడగవద్దు అని మీడియాకు చెప్పేశారు.

దీనికి ముందు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి  ఎన్నో డెడ్ లైన్లు పెట్టి మరీ నాటి టీడీపీ ప్రభుత్వం నేటి వైసీపీ సర్కార్ దాన్ని ఎంత అపహాస్యం చేయాలో అంతా చేసాయి. ఇపుడు డయాఫ్రం వాల్ కి డ్యామేజ్ జరిగిందని, దానికి రిపేర్లు చేయించాలా లేక మొత్తం తిరిగి నిర్మించాలా అన్న దగ్గర ఏపీ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ విషయం తేలేవరకూ పోలవరం ఊసు మరచిపోవచ్చు అని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలోని పోలవరం నిర్మాణం ఎపుడు పూర్తి అవుతుంది అన్న దాని మీద తెలంగాణా మంత్రి టీయారెస్ నాయకుడు హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ మరో అయిదేళ్ళు అయినా ఏపీలో పూర్తి అవదని ఆయన జోస్యం చెప్పారు ఈ విషయం మీద తాను పోలవరం ఇంజనీర్లతోనే స్వయంగా మాట్లాడి అంతా తెలుసుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ ఇంజనీర్ల మాటలను బట్టి చూస్తే మరో అయిదేళ్ళలో పోలవరం పూర్తి అయితే అది చాలా తొందరగా అయినట్లుగా చెబుతున్నారని హరీష్ రావు సెటైర్లు వేశారు. పోలవరం కంటే ఆలస్యంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తెలంగాణా సర్కార్ పూర్తి చేసి చూపించిందని, దాని మీద విపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

ఇవన్నె పక్కన పెడితే ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. కేంద్రం మద్దతుతో జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరం ఎపుడో పూఒర్తి కావాలి. విభజన చట్టం మేరకు పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. కానీ దాన్ని నాటి టీడీపీ సర్కార్ తమ చేతూలోకి తీసుకోవడంతోనే సగం తప్పిదం జరిగింది. ఇపుడు వైసీపీ సర్కార్ కూడా అదే తోవన నడుస్తూ పోలవరం విషయంలో చేస్తున్న నిర్వాకం వల్ల నిర్మాణ వ్యయం మరింతగా పెరిగి అసలు పూర్తి అవుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి.

పొరుగు మంత్రి హరీష్ రావు అన్నాడని కాదు కానీ మరో అయిదేళ్ళు అయినా పోలవరం పూర్తి కాకపోతే ఇక ఎప్పటికి కాదు అనే అంటారు అంతా. ఎందుకంటే నిన్నటికీ నేటికీ పరిస్థితులు మారిపోతున్న నేపధ్యం ఉంది. అలాగే రేపటికి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న పోలవరం విషయంలో కాలంతో పాటు నిర్మాణ వ్యయం పెరుగొతంది అలాగే చిక్కులూ చికాకులూ ఇంకా ఎక్కువగా పెరిగిపోతునాయి.
Tags:    

Similar News