ఆర్టీసీ సమ్మెలో షాకింగ్ ఘటన..కేసీఆర్ సర్కార్ ఉలికిపాటు

Update: 2019-10-13 05:15 GMT
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తెలుగోళ్లు మర్చిపోయే ఛాన్సే లేదు. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాన్ని మరోదశకు వెళ్లేలా చేయటమే కాదు.. సుదీర్ఘకాల ఆకాంక్ష తీరేందుకు చోటు చేసుకున్న ఘటనల్లో శ్రీకాంతాచారి బలిదానం కీలకమని చెప్పాలి. తన చావుతోనైనా తెలంగాణ రావాలని బలిదానం చేసిన శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ ఉద్యమం మహోగ్రరూపం సంతరించుకోవటమే కాదు.. చివరకు ఢిల్లీ సైతం విభజన దిశగా అడుగులు వేసేలా చేసింది.

ఈ ఘటన జరిగి దగ్గర దగ్గర పదేళ్లు అవుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి శ్రీకాంతాచారిని గుర్తు చేస్తూ తనను తాను కాల్చేసుకున్న  షాకింగ్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి తనను తాను నిప్పు పెట్టుకున్న వైనం సంచలనంగా మారింది.

ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తన చావుతోనైనా 48 వేల మంది జీవితాలు మంచిగా ఉండాలని..తన బలిదానం చూసైనా ప్రభుత్వం ఆర్టీసీని పట్టించుకోవాలంటూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి అగ్ని జ్వాలల్లో కాలారు. దాదాపు 94 శాతం కాలిన ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ఆయన్ను అత్యవసరంగా హైదరాబాద్ లోని డీఆర్ డీవో అపోలోకు తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటున్నారు.

గడిచిన ఏడు రోజులుగా సాగిన ఆర్టీసీ సమ్మెలో తాజా ఉదంతం ఆర్టీసీ ఉద్యోగుల్ని నివ్వెర పోయేలా చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిన పరిస్థితి. ఖమ్మం జిల్లా డ్రైవర్ ఒకరు డిమాండ్ల సాధన కోసం తనను తాను కాల్చేసుకున్న వైనంతో ఆర్టీసీ సమ్మె మరింతగా ముదిరింది. ఆర్థికంగా మంచి స్థితి.. చక్కటి జాతీయ భావాలతో ఉండే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కొడుకులు సైన్యంలో పని చేస్తున్నారు. జీవితానికి సంబంధించి ఎలాంటి లోటు లేకున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఆవేదనలో మునిగిపోయిన ఆయన.. తన చావుతో అయినా కేసీఆర్ ప్రభుత్వంలో మార్పు రావాలని కోరటం గమనార్హం.

ఆర్టీసీలోని 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోతే.. వారినే నమ్మకున్న కుటుంబాలు ఏం కావాలి?  పూట గడిచే దిక్కు లేని వారంతా రోడ్ల మీదకు రావాలా? మనం చేస్తున్న సమ్మెతో సర్కారు దిగి వస్తుందా?  మన డిమాండ్లను పట్టించుకుంటుందా? అన్న సందేహాల్ని తరచూ తన సహచరుల దగ్గర వ్యక్తం చేస్తున్న శ్రీనివాసరెడ్డి.. తనను తాను ఆత్మాహుతి చేసుకోవటం ద్వారా ప్రభుత్వానికి బలమైన సంకేతాన్ని పంపాలన్న ఉద్దేశంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.

శ్రీనివాసరెడ్డి ఘటనతో ప్రభుత్వం ఉలికిపాటుకు గురైంది. సమ్మె విషయంలో వెనక్కి తగ్గకూడదని ప్రభుత్వం.. తనను తాను త్యాగం చేసుకోవటానికి సిద్ధమైన శ్రీనివాసరెడ్డి ఉదంతంలో.. ప్రభుత్వంతో తేల్చుకోవాలని ఆర్టీసీ సంఘాలు పట్టుదలతో ఉండటంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News