కేసీఆర్ కు షాక్.. తాత్కాలిక కండక్టర్ పై డ్రైవర్ అఘాయిత్యం

Update: 2019-10-18 13:14 GMT
షాక్.. మహిళా కండక్టర్ పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం  మొండితనం ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో చెప్పే ఘటనగా చెప్పాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో వెనక్కి తగ్గేందుకు ఏ మాత్రం ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు వీలుగా తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ బస్సుల్ని నడుపుతున్నారు.

అరకొర అనుభవం ఉన్న సిబ్బంది కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకోగా.. తాజాగా ఒక దారుణం బయటకు వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సులో పని చేసే తాత్కాలిక మహిళా కండక్టర్ పైన తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం చేయటం సంచలనంగా మారింది.

ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండా పథకం ప్రకారం కండక్టర్ మీద అత్యాచారం చేయటం కోసం పథకం పన్నాడు. లైంగిక దాడికి ప్రయత్నించాడు. లక్కీగా.. సదరు మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తాత్కాలిక డ్రైవర్ బారి నుంచి తప్పించుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

ఆర్టీసీ చరిత్రలో ఇప్పటివరకూ మహిళా కండక్టర్ పట్ల సిబ్బంది ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించింది లేదు. అలాంటి సంస్థలో తెలంగాణ ప్రభుత్వం మొండితనం కారణంగా చోటు చేసుకున్న ఉదంతం.. ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక సిబ్బందితో విధులు నిర్వర్తించటం అగ్గితో ఆడుకోవటమే కాదు.. ప్రయాణికులకు సైతం సేఫ్ కాదన్న వైనం తాజా ఉదంతంతో స్పష్టమైందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News