శ్రీవారి ఆస్తుల అమ్మకంపై కీలక నిర్ణయం తీసుకున్న పాలకమండలి !

Update: 2020-05-28 12:10 GMT
గత కొన్ని రోజులుగా తిరుమల శ్రీవారి ఆస్తులపై పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి ఆస్తుల అమ్మకం ప్రక్రియని నిపిలివేసింది. సాధారణంగా 3 నెలలకు ఒక్కసారి టీటీడీ బోర్డు మీటింగ్ నిర్వహించాల్సి ఉండడంతో... లాక్‌ డౌన్ ఉన్నప్పటికీ పాలకమండలి సమావేశం అయ్యింది. అయితే ఈసారి ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది.

ఇలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి భేటీ కావడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ భేటీలో దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో టీటీడీ ఆస్తులను విక్రయించకూడదని నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఛైర్మెన్ వై వీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు.

టిటిడి ఆస్తులను భవిష్యత్తులో అమ్మడం అనేది నిషేధించాము.. దీనిపైనే బోర్డ్ తీర్మానం చేసింది.. ఇటీవల భూముల వేలానికి సంబంధించి వివాదం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నాము.. టిటిడి ఆస్తుల పరిరక్షణకు టిటిడి బోర్డ్ సభ్యులు, స్వామీజీలతో కమిటీ వేశాము అని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. సెంటిమెంట్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇస్తాము అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

అలాగే, తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత రెండున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా ఉండి. తమ బోర్డులో సమీక్షించిన తర్వాత, అమ్మకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, ప్రభుత్వంపై, తమ పాలక మండలిపై విస్తృతమైన ప్రచారం జరిగిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అలాగే, ఈ భేటీలో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 20 కోట్లు కేటాయించింది. టీటీడీ విద్యా సంస్థల్లో ఉద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 8 ఆలయాలను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Tags:    

Similar News