టీడీపీలో మొద‌లైన బ్రాహ్మ‌ణి జపం!

Update: 2017-11-03 08:32 GMT
తెలంగాణ తెలుగు త‌మ్ముళ్ల‌కు నారా బ్రాహ్మ‌ణి ఆశాదీపంగా మారారు. బాల‌య్య కుమార్తెగా.. లోకేశ్ స‌తీమ‌ణిగా.. చంద్ర‌బాబు కోడ‌లిగా సుప‌రిచితురాలైన ఆమెలో మంచి పారిశ్రామిక‌వేత్త ఉన్నారు. విష‌యాన్ని సూటిగా చెప్ప‌టం.. ఎంత అవ‌స‌రం ఉంటే అంతే మాట్లాడ‌టం.. వేగంగా రియాక్ట్ కావ‌టం ఆమె ల‌క్ష‌ణాలుగా చెబుతారు.

అలాంటి ఆమె సార‌థ్యంలోకి పార్టీ వెళితే త‌మ‌కు తిరుగులేద‌న్న‌ది తెలంగాణ తెలుగుదేశం నేత‌ల మాట‌గా మారింది. ఇంత‌కాలం పార్టీ ప్రైవేటు వేదిక‌ల మీద బ్రాహ్మ‌ణి మాట చ‌ర్చ‌కు వ‌చ్చినా ఎప్పుడూ సీరియ‌స్ చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి.

నిన్నటి వ‌ర‌కూ పార్టీకి అండ‌గా ఉంటూ.. భ‌విష్య‌త్ ఆశాదీపంగా నిలిచిన ఫైర్ బ్రాండ్ రేవంత్ ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోవ‌టం.. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు నేత‌లు క్యూ క‌ట్ట‌టంతో అమ‌రావ‌తిలో కూర్చున్న బాబుకు ఒక్క‌సారి తెలంగాణ‌లో పార్టీ గుర్తుకు వ‌చ్చింది. అంతే.. ప‌రుగుప‌రుగ‌న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వ‌చ్చారు.

త‌మ్ముళ్ల‌తో మీటింగ్ పెట్టారు. పార్టీ సంగ‌తి తాను చూసుకుంటాన‌ని.. ఏం భ‌యం అక్క‌ర్లేదంటూ అభ‌య‌మిచ్చారు. అధినేత స‌మ‌క్షంలో ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌ని ఎల్ ర‌మ‌ణ‌.. తెలంగాణ అసెంబ్లీ మీద టీడీపీ జెండా ఎగ‌రేస్తానంటూ పెద్ద మాట‌ను చెప్పారు. మ‌రింత నాట‌కీయంగా జ‌రుగుతున్న సీన్‌ ను ర‌క్తి క‌ట్టించ‌క‌పోతే బాగోద‌ని అనుకున్నారో ఏమో కానీ..అక్క‌డున్న వారు ఆవేశంతో చ‌ప్ప‌ట్లు కొట్టేశారు. దీంతో.. చంద్ర‌బాబుముఖంలోనూ సంతోషం రేఖా మాత్రంగా విరిసి మాయ‌మైంది.

ఇదంతా బాగానే ఉన్నా.. ఉన్న‌ట్లుండి తెలుగు త‌మ్ముఢు ఒక‌రు బ్రాహ్మ‌ణి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ప్ర‌కాశ్‌ రెడ్డి అనే మీడియా బాధ్య‌త‌లు చూసే నేత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పార్టీని బ్రాహ్మ‌ణికి అప్ప‌గించాల‌న్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కు మించి ప‌త్రిక‌ల్లో ఏమీ క‌వ‌ర్ కాలేదు కానీ.. ఈ మాట‌ను అచ్చేసిన ప‌త్రిక‌లు టీటీడీపీలో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని తెలిసేలా చేసి పుణ్యం క‌ట్టుకున్నార‌ని చెప్పాలి.

టీడీపీకి భ‌విష్య‌త్ ఆశాదీపంలా చెప్పుకునే నారాలోకేశ్‌ను వ‌దిలేసి.. బ్రాహ్మ‌ణి బాట ప‌ట్ట‌టం చూస్తే.. మంత్రిగా ఏపీలో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌స్తావ‌న తీసుకురాలేద‌న్న‌ట్లుగా ఉంది. వ్యాపార వ్య‌వ‌హారాలు చూసుకుంటూ.. ఎన్టీఆర్ ట్ర‌స్టు వ్య‌వ‌హారాల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తున్న బ్రాహ్మ‌ణికి కానీ తెలంగాణ పార్టీ ప‌గ్గాలు ఇస్తే బాగుంటుంద‌న్న ఆశ‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇంత‌కాలం పార్టీ నేత‌ల మ‌ధ్య వ‌చ్చే బ్రాహ్మ‌ణి ప్ర‌స్తావ‌న తొలిసారి పార్టీ వేదిక సాక్షిగా రావ‌టం చూసిన‌ప్పుడు.. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మ‌రింత పెరిగి పెద్ద‌ది కావ‌టం ఖాయ‌మ‌న్న సంకేతాన్ని తాజా స‌మావేశం ఇచ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News