అమ‌రావ‌తికి కేసీఆర్ వెళ్ల‌కున్నావాళ్లంతా రెడీ

Update: 2015-10-16 07:20 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఇపుడు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోని అన్ని రాష్ర్టాల సీఎంల‌ను ఆహ్వానించిన‌ట్లే...పొరుగు రాష్ర్ట‌మైన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌ను ఆహ్వానిస్తామ‌ని, తెలంగాణ‌కు చెందిన అన్ని పార్టీల ముఖ్య‌నేత‌ల‌కు ఆహ్వానాలు అందిస్తామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ స‌హా ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు వెల్ల‌డంపై ఇంకా సందిగ్ద‌త కొన‌సాగుతోంది. ఇదిలాఉంటే...తెలంగాణ‌కు చెందిన తెలుగుదేశం నేతలు శంఖుస్థాప‌న‌కు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఆహ్వానాలు అందిన నేప‌థ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ - వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి -  టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు - పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర కమిటీ కోరినట్టు సమాచారం. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావతి శంకుస్థాపన కార్యక్రమానికి మూడు దేశాల ప్రధానమంత్రులను - దేశంలోని వీవీఐపీల‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దాదాపు పది లక్షల మంది వరకు ఇందులో భాగస్వాముల్నీ చేయాలని చంద్ర‌బాబు సంకల్పించారు. ఈ నేప‌థ్యంలో టీటీడీపీ నేత‌లు హాజ‌రు అయ్యేందుకు రెడీ అయిపోయారు. కొంత మంది కీలకనాయకులు - ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో సహా అమరావతి వెళ్లాలని భావిస్తున్నట్లు స‌మాచారం. దీంతోపాటు అమరావతి నిర్మాణంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మై బ్రిక్‌- మై అమరావతి' కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కొంత మంది నేతలు అనుకుంటున్నట్లు స‌మాచారం. ఆన్‌ లైన్‌ లో ఇటుకలను కొని అమరావతికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News