కాళ్లు ప‌ట్టుకున్నంత ప‌ని చేస్తున్నార‌ట‌!

Update: 2018-12-24 06:00 GMT
కాల మ‌హిమ అంటే ఇదేనేమో. రెండు.. మూడు నెల‌ల వ‌ర‌కే కాదు.. నెల క్రితం ఇదే స‌మ‌యానికి తెలంగాణ తెలుగు త‌మ్ముళ్ల హ‌డావుడి అంతా ఇంతా కాదు. దాదాపు నాలుగున్న‌రేళ్లు కామ్ గా ఉండిపోయిన వారంతా చెల‌రేగిపోయారు. ఇంకేముంది? అధికారంలోకి రావ‌ట‌మే త‌రువాయి.. వ‌చ్చినంత‌నే త‌మ రాజ్యం వ‌స్తుంద‌న్న ప‌గ‌టి క‌ల‌లు ఓ రేంజ్లో క‌న్నారు.

అయితే.. క‌ర్ర కాల్చి వాత పెట్టిన చందంగా తెలంగాణ ఓట‌ర్లు గులాబీ కారుకు ఏకంగా 88 సీట్లు క‌ట్ట‌బెట్టి త‌మ్ముళ్లు ఇప్ప‌ట్లో లేవ‌ని రీతిలో క‌రెంటు షాకిచ్చినంత ప‌ని చేశారు. రానున్న రోజుల్లో త‌మ‌దే ప‌వ‌రంతా అని ఫీలైన త‌మ్ముళ్ల‌కు తెలంగాణ ఓట‌ర్లు ఇచ్చిన తీర్పును నేటికి జీర్ణించుకోలేని ప‌రిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా త‌మ‌కు ద‌క్కిన రెండు సీట్ల‌కు చెందిన ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలు కూడా ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఎవ‌రు వెళ్లినా ఫ‌ర్లేదు కానీ.. స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌టవీర‌య్య కానీ పార్టీ మారితే.. తెలుగుదేశం పార్టీలో భూకంపం వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పడాల్సిన అవ‌స‌రం లేదు.

అందుకే.. గ‌తంలో మ‌రే నేత‌కు లేని విధంగా సండ్ర‌ను పార్టీ మారొద్ద‌న్న బుజ్జ‌గింపులు.. బ్ర‌తిమిలాడుకోవ‌టాలు.. ఒత్తిళ్లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. టీఆర్ ఎస్‌ లోకి సండ్ర చేర‌నున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల‌తో అలెర్ట్ అయిన తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు.. ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు చొప్పున సండ్ర‌కు భారీ లెవ‌ల్లో రిక్వెస్టు చేస్తున్నార‌ట‌. గ‌తాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని సండ్ర‌కు గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌.

పార్టీ నుంచి టీఆర్ ఎస్‌ కు వెళ్లిన సీనియ‌ర్ నేత‌లు తాజాగా అక్క‌డ‌ ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌న్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. పార్టీ మారొద్దంటూ విప‌రీతంగా బ్ర‌తిమిలాడుతున్నార‌ట‌. సండ్ర క‌నుక చేజారిపోతే తమ అధినేత‌కు భారీ దెబ్బ‌తో పాటు.. తెలంగాణ‌లో పార్టీ అన్న‌దేమీ ఉండ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. దీంతో.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చొప్పున తెలుగు త‌మ్ముళ్లు సండ్ర‌తో రాయ‌బారాలు చేయ‌ట‌మే కాదు.. పార్టీని వీడిపోవ‌ద్దంటూ రిక్వెస్ట్‌ లు చేస్తున్న వైనం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంద‌ట‌. సండ్ర కాళ్లు ప‌ట్టుకోవ‌టం మిన‌హా ఆయ‌న్ను బ్ర‌తిమిలాడే సంద‌ర్భంగా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News