ఓట్లు అడిగేందుకు వ‌చ్చి ఈ తిట్లేంది తుమ్మ‌ల‌?

Update: 2019-03-29 05:24 GMT
కొంద‌రికి కొన్ని సూట్ అయినంత చ‌క్క‌గా మ‌రెవ‌రికీ సూట్ కావు. తెలంగాణ రాష్ట్రంలో నేత‌లు ఎంత మంది ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే తిట్లు ముచ్చ‌ట‌గా ఉండ‌ట‌మే కాదు.. ఆయ‌న తిట్టినా హాయిగా అనిపిస్తాయే కానీ ఎందింత‌గా తిట్టారే అన్న‌ట్లు ఉండ‌దు.

ప్ర‌త్య‌ర్థుల్ని క‌డిగి పారేసే కేసీఆర్‌.. నోటి నుంచి ప‌రుషంగా మాట‌లు వ‌చ్చినా.. ఒక‌ట్రెండు ఎక్కువ త‌క్కువ మాట‌లు మాట్లాడినా జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అరే.. మ‌న కేసీఆరే గా అన్న‌ట్లు స‌ర్దిచెప్పుకుంటారు. స‌మాధాన‌ప‌డ‌తారు. అలాంటి అదృష్టం అంద‌రికి ఉండ‌దు. పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకున్న త‌ర‌హాలో.. కేసీఆర్ త‌ర‌హాలో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న మాదిరి తిట్టి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తే మొద‌టికే మోసం రావొచ్చు.

ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి తుమ్మ‌ల‌. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక రీతిలో తీర్పు వ‌స్తే.. ఖ‌మ్మం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా రావ‌టం తెలిసిందే. మాజీ మంత్రి తుమ్మ‌ల‌కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన అక్క‌డి ప్ర‌జ‌ల మీద ఆయ‌నెంత గుర్రుగా ఉన్నారన్న విష‌యం తాజాగా ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిస్తే పాలేరును రాష్ట్రంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిల‌పాల‌ని అనుకున్నాన‌ని.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. ఖ‌మ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్‌కు ఓటేసిన‌ట్లుగా చెప్పారు. అక్క‌డితో ఆగ‌ని తుమ్మ‌ల‌.. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. ఇప్పుడా ఓట్లు ఏమ‌య్యాయి?  మురిగిపోయి.. మురుగుకాల్వ‌లో క‌లిసిపోయాయి. కాంగ్రెస్ కు ఓట్లేసిన వాళ్లు ఇప్పుడు కుమిలిపోతున్నార‌ని.. గ‌త పొర‌పాటు మ‌ళ్లీ పున‌రావృతం అయితే మిమ్మ‌ల్ని కుక్క‌లు కూడా చూడ‌వంటూ మండిప‌డ్డారు.

ఎంత ప్ర‌జ‌లైతే మాత్రం మ‌రీ ఇంత చుల‌క‌న‌? అన్న‌ట్లుగా తుమ్మ‌ల మాటలు ఉన్నాయ‌ని చెప్పాలి. తుమ్మ‌ల‌కు వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని.. ఆయ‌న ఓట‌మి ప‌క్కా అని కేసీఆర్ ద‌గ్గ‌ర రిపోర్టులు ఉన్న విష‌యం అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంలోనే వార్త‌లు వ‌చ్చాయి. త‌న చేత‌కానిత‌నాన్ని ప్ర‌జ‌ల‌కు ఆపాదించి.. తన తీరుతో ఓట‌మిని చేజేతులారా కొని తెచ్చుకున్న తుమ్మ‌ల‌.. ఈ రోజున ప్ర‌జ‌ల్ని ఉద్దేశించి అంత చుల‌క‌న‌గా మాట్లాడ‌టం స‌రికాద‌న్న మాట వినిపిస్తోంది. తురుంఖాన్ అన్న‌ట్లుగా తుమ్మ‌ల్ని వెంటేసుకొని ప్ర‌చారం చేస్తున్న ఖ‌మ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి నామా త‌న ప్ర‌చార స్టైల్ ను మార్చ‌క‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది. ఓట్లు అడిగేందుకు వ‌చ్చి.. ఇలా తిట్టేస్తే జ‌నం ఓట్లేస్తారా తుమ్మ‌ల‌?
Tags:    

Similar News