తుమ్మల కూడా ‘చిల్లర మాటలు’ అనేశాడే

Update: 2016-06-06 10:15 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎంత దూకుడుగా మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతోఇంతో సంయమనంతో మాట్లాడే నేతలు ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటోళ్లు ఒకరిద్దరు మాత్రమే. ఫైర్ బ్రాండ్ తరహాగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడుతుంటారు. అలాంటి తుమ్మలకు కూడా కోపం వచ్చేసింది. ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడటమే కాదు.. ‘చిల్లర రాజకీయాలు’ చేస్తారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కూల్ గా ఉండే తుమ్మలకు ఎందుకంత కోపం వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. కృష్ణా నది మీద తెలంగాణ సర్కారు నిర్మించాలని భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల.. డిండి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తుమ్మలకు చాలా కోపం వచ్చేసింది.

కేంద్రం అండగా ఉందని ఏపీ సర్కారు విర్రవీగుతుందంటూ ఊగిపోయిన ఆయన.. మీ రాష్ట్రంలోని రాజకీయాల కోసం తెలంగాణను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ మండిపడ్డారు. మీ చిల్లర రాజకీయాల కోసం మా ప్రాజెక్టుల్ని ఆపమంటే  కుదరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంయమనంతో ఉండే తుమ్మల కూడా ఏపీ సర్కారు మీద ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News