సిరంజీ మ‌ర‌క వేసి మ‌నోళ్ల‌పై నిషేధం వేటు!

Update: 2018-04-14 05:01 GMT
మ‌ర‌క మంచిదే అంటూ ఒక ప్ర‌ముఖసంస్థ ఉత్ప‌త్తిని ప్ర‌మోట్ చేసేందుకు వేసే యాడ్ చాలా ఫేమ‌స్‌. తాజా ఉదంతంలో మాత్రం ప్ర‌స్తావించే మ‌ర‌క అస్స‌లు మంచిది కాదు. కామ‌న్వెల్త క్రీడ‌లు మొద‌లైన నాటి నుంచి శుభ వార్త‌ల మీద శుభ‌వార్త‌లు వింటున్నాం. మ‌నోళ్లు అద‌ర‌గొడుతూ ప‌త‌కాలు సాధిస్తున్నారు.

ఈ వార్త‌లు భార‌తీయుల్ని సంతోషంలో ముంచెత్తుతున్నాయి. మిగిలిన ప్ర‌భుత్వాల మాదిరే మోడీ ప్ర‌భుత్వంలోనూ క్రీడాశాఖ‌లో ఎలాంటి మార్పులు రాకున్నా.. క్రీడాకారుల‌కు అర‌కొర స‌దుపాయాలు క‌ల్పించినా.. వాటి కార‌ణంగా ఏర్ప‌డే ఇబ్బందుల్ని పంటి బిగువునా భ‌రిస్తూ.. ప‌త‌కాలు సాధిస్తున్నారు. ఇలాంటివేళ షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇద్ద‌రు భార‌త అథ్లెట్లు రూల్స్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో కామ‌న్వెల్త్ క్రీడ‌ల స‌మాఖ్య నిషేధం వేటు వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వీరిద్ద‌రిని వెంట‌నే స్వదేశం పంపించాలంటూ భార‌త అథ్లెటిక్ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చింది. ట్రిపుల్ జంప‌ర్ వి.రాకేష్ బాబు.. రేస్ వాక‌ర్ ఇర్ఫాన్ కామ‌న్వెల్త్ క్రీడ‌ల నో నీడిల్ పాల‌సీని ఉల్లంఘించిన‌ట్లుగా రుజువు కావ‌టంతో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. క్రీడ‌ల గ్రామంలో వారు ఉంటున్న బెడ్రూంల‌లో ఉప‌యోగించిన సిరంజీని క‌నుగొన్నారు.

క్లీనింగ్ సిబ్బంది ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఉప‌యోగించిన బెడ్రూంలో సిరంజీని గుర్తించి.. ఆ స‌మాచారాన్ని అధికారుల‌కు అంద‌జేశారు.నిషేధం వేటు ప‌డిన భార‌త అథ్లెట్ల సంచిలోనూ ఒక సిరంజీని క్లీనింగ్ సిబ్బంది గుర్తించిన‌ట్లుగా వెల్ల‌డైంది. దీంతో.. రాకేష్ బాబు.. ఇర్ఫాన్ల‌పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టంతో పాటు వారి అక్రిడియేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కాలం ప‌త‌కాలు సాధిస్తూ భార‌తీయుల మ‌న‌సుల్ని దోచుకుంటున్న క్రీడాకారుల తీరుకు భిన్నంగా.. దేశ ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల్ని మంట‌గ‌లిపేలా ఇద్ద‌రు అథ్లెట్లు వ్య‌వ‌హ‌రించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News