102 మంది తర్వాత సంతానం తర్వాత వృద్ధుడికి ‘జ్ఞానోదయం’..!

Update: 2022-12-27 16:30 GMT
ఈ రోజుల్లో ఒక్క భార్య.. ఇద్దరు పిల్లలతోనే వేగలేక పోతుంటే వీడెవడో గానీ ఏకంగా 102 మంది పిల్లలను కన్నాడు. నాడు మహాభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది కౌరవులు సంతానంగా ఉంటే ఆ రికార్డు కలియుగంలో ఓ వ్యక్తి తిరగరాశాడు. అయితే పిల్లల పోషణకు తన సంపాదన సరిపోవడం లేదని ఇకపై పిల్లలు కనకూడదని ఆ వ్యక్తి తాజాగా నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  
 
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉగాండాకు చెందిన ముస హసహ్య అనే వ్యక్తికి 16 ఏళ్ళ వయస్సులో తొలిసారి వివాహం జరిగింది. 19 ఏళ్లకే తొలిసారి తండ్రి అయ్యాడు. మొదటి సంతానంగా కూతురు జన్మించింది. ఇప్పుడు అతడి వయస్సు ప్రస్తుతం 67 కాగా భార్యల సంఖ్య 12. వీరికి 102 మంది పిల్లలు కాగా మనవడు.. మనవరాళ్ల సంఖ్య 568 కావడం విశేషం.  

16 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న ముసా హసహ్య సంసార సుఖానికి బాగా అలవాటు పడినట్టు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత వరుసబెట్టి 11 పెళ్లి చేసుకున్నాడు. డజను మంది భార్యలతో సంసారం చేస్తూ ఒకరి తర్వాత ఒకరితో పిల్లలను కంటూ పోయాడు. దీంతో అతడికి 67 ఏళ్లు వచ్చే నాటికి మొత్తంగా 102 మంది సంతానం ఉన్నారు.  

ఉగాండాలో గ్రామ చైర్ పర్సన్ గా ఉన్న ముసా హసహ్య మంచి వ్యాపారవేత్త కూడా. తన వద్ద కావాల్సినంత డబ్బు ఉండటంతో కుటుంబ పోషణ అతడికి భారం అనిపించలేదు. ఈ కారణంగానే అతడు పెళ్లిళ్లు చేసుకున్నా.. పిల్లలు కన్నా ఏం పర్వాదులేదని అనుకున్నాడు. అయితే కూర్చోని తింటే కొండలైన కరిగిపోవాల్సిందే అన్నట్లుగా ముసా హసహ్య పరిస్థితి మారిపోయింది.

డజను మంది భార్యలు.. 102 మంది పిల్లలను పోషించేందుకు రోజు వారీ ఖర్చు భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి ఆదాయం అతడి కుటుంబ పోషణకు సరిపోవడం లేదట. దీంతోనే ఇకపై తాను పిల్లలను కనబోనని నిర్ణయం తీసుకున్నట్లు ముస హసహ్య చెబుతున్నాడు. తన భార్యలకు సైతం ఇదే విషయాన్ని చెప్పానని వారంతా పిల్లలు పుట్టకుండా మందులు వాడుతున్నారని తెలిపాడు.

ప్రస్తుతం అతడికి ఉగాండాలోని బుగిసాలో 12 బెడ్ రూముల ఇల్లు ఉంది. ఈ 12 బెడ్ రూముల్లో 12 మంది భార్యలు ఉండటం గమనార్హం. ముసాకు 568 మనవలు.. మనవరాళ్లు ఉండగా వీరిందరి పేర్లు తనకు తెలియవని ముసా చెబుతున్నాడు. కాగా 102మంది పిల్లలు కన్నా తర్వాత ఆ వ్యక్తికి మరొకరిని కనకూడదనే జ్ఞానోదయం కలగడమే విచిత్రంగా ఉందని నెటిజన్లు సైటర్లు పేలుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News