జెలెన్ స్కీ భావోద్వేగం.. నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావొచ్చు

Update: 2022-03-06 12:30 GMT
రష్యా- ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. రష్యా దాడులకు ప్రతిదాడులు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటోంది. అదే సమయంలో తమకు కొన్ని యుద్ధ విమానాల్ని వెంటనే అందించాలని అమెరికాను ఆయన కోరుతున్నారు.

అయితే.. ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అవుతోంది. యుద్ధం దిశగా ముందుకు వెళ్లేలా తోసిన నాటో దేశాలు.. చివరకు యుద్దం వచ్చిన తర్వాత మాత్రం ఉక్రెయిన్ కు హ్యాండిచ్చిన వైనం చూసి.. ప్రపంచ దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా అమెరికా చట్టసభ్యులు 300 మందితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాదాపు గంట పాటు వీడియో కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి భావోద్వేగ వ్యాఖ్యలతో పాటు.. కొన్ని షాకింగ్ అంశాల్ని ప్రస్తావించారు. తాను ఇప్పటికి ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనే ఉన్నట్లు చెప్పారు. తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి అవ్వొచ్చన్న ఆయన మాటల్ని చూస్తే.. ఉక్రెయిన్ లోని యుద్ధ పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

తమ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని నాటోను మరోసారి కోరిన ఆయన.. తమ దేశస్తులు స్వాతంత్య్రాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరన్నారు. ఆక్రమదారుల నుంచి మాత్రభూమిని కాపాడుకుంటామన్న ఆయన. . రష్యా దళాలలతో ప్రతిఘటన ఆపటం లేదని..వారి దేశానికి తిరిగి వెళ్లిపోవాలని రష్యన్ సేనల ముందు ఉక్రెయిన్లు నినాదాలు చేస్తున్నారన్నారు. రష్యా దళాలకు ఎదురవుతున్న వ్యతిరేకత వారికి అవమానంగా అభివర్ణించారు.

యుద్ధ విమానాలు తమకు పంపాలని.. రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు కఠినతరం చేయాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ భూమిలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటామని.. తమ దేశ ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని.. శత్రువులు ప్రవేశించిన అన్ని నగరాల్లోనూ పోరాడతామన్న ఆయన ఉద్వేగ ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది.
Tags:    

Similar News