రష్యాకు షాకులు ఇస్తున్న ఉక్రెయిన్.. ఎదురుదాడులతో రష్యా ఆశలకు గండి

Update: 2022-05-01 08:30 GMT
యుద్దం ఆరంభించటం తేలికే. కానీ.. దాన్ని అనుకున్న రీతిలో ముగించటం మాత్రం చాలా కష్టం. అసలు యుద్ధం వరకు ఎందుకు వెళ్లాలి? అంతవరకు వెళ్లకుండా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా మొండిగా యుద్ధానికి దిగింది రష్యా. కేవలం వారం వ్యవధిలో ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంటామని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకున్న రష్యా సైనానికి ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉక్రెయిన్ తాము అనుకున్నంత పిల్ల కాకి కాదన్న విషయం రష్యా సైనికులకు బాగానే అర్థమవుతుంది.

వారంలో ముగియాల్సిన యుద్ధం.. రెండు నెలలు అవుతున్నా ఒక కొలిక్కిరాకపోవటమే కాదు.. అనుకోని ఎదురుదెబ్బలు రష్యాకు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పుఉక్రెయిన్ లోని డోన్బాస్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవటం ద్వారా యుద్ధాన్ని పరస్పర అంగీకారంతో ముగింపు పలకాలని ఆశించారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు రష్యాకు ఎదురవుతున్నాయి. తాజాగా టార్గెట్ పెట్టుకున్న డోన్బాస్ ను స్వాధీనం చేసుకునే విషయంలో రష్యా ప్రదర్శిస్తున్న దూకుడుకు స్పందనగా అక్కడ ఎదురుదాడి జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఉక్రెయిన్ సైన్యం సైతం చెలరేగిపోతూ.. తాజాగా లుహాన్స్ క్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడి సందర్భంగా ఉక్రెయిన్ లు స్పందించి.. రష్యా సైనికుల్ని పెద్ద ఎత్తున హతమారుస్తున్నారు. దీంతో రష్యా యుద్ద ప్రణాళిక బాగా నెమ్మదించినట్లుగా పేర్కొన్నారు. తాజా పరిణామాలతో పుతిన్ సైన్యం ఆత్మస్థైర్యం బాగా దెబ్బతిందన్న మాట వినిపిస్తోంది.

మరోవైపుయుద్దం ఎక్కువ కాలం జరిగే కొద్దీ.. రష్యా ఆర్థిక పరిస్తితి అంతకంతకూ కుంచించుకుపోవటం ఖాయమంటున్నారు. ఈ యుద్దం కారణంగా ఈ ఏడాది 10 శాతానికి పైగా రష్యా ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వెల్లడవుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు.. మందుగుండు పెద్ద ఎత్తున సాయంగా ఇస్తున్న తీరు రష్యాకు ఇప్పుడో పెద్ద సమస్యగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News