ఎన్నిక‌ల్లో పోటీకి నో అంటున్న ఫైర్ బ్రాండ్

Update: 2018-02-13 04:40 GMT
పేరు చెప్పినంత‌నే ఫైర్ బ్రాండ్ నేత‌గా గుర్తుకు వ‌స్తారు. మాట‌ల‌తో మంట‌లు పుట్టించే నేత‌గా అందిరికి సుప‌రిచిత‌మైన ఆమె.. ఇక‌పై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నంటే చేయ‌న‌ని తెగేసి చెబుతున్నారు. ముఖ్య‌మంత్రిగా.. కేంద్ర మంత్రిగా వివిధ ప‌దవుల్ని చేప‌ట్టిన ఆమెకు.. వ‌యోభారం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటారా? ఆమే.. కేంద్ర‌మంత్రి ఉమాభార‌తి.

పెరిగే వ‌య‌సుతో పాటు వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమె తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. అనారోగ్యంతో గ‌డిచిన కొద్ది కాలంగా యాక్టివ్ గా ఉండ‌లేక‌పోతున్న ఆమె.. తానిక ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఉండ‌న‌ని చెప్పేస్తున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా తీవ్ర‌మైన వెన్ను.. మోకాళ్ల నొప్పితో ఇబ్బందులు ప‌డుతున్న ఆమె.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని చెబుతున్నారు.

త‌న‌కున్న అనారోగ్యం కార‌ణంగానే తానీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఆమె చెబుతున్నారు. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నంత మాత్రాన రాజ‌కీయాల్లో ఉండ‌న‌ని కాదంటూ క్లారిటీ ఇస్తున్న ఆమె.. పార్టీ కోసం మాత్రం ప‌ని చేస్తూనే ఉంటాన‌ని చెప్పారు. చూస్తుంటే.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక త‌రం నేత‌లు విశ్రాంతి తీసుకోనున్నట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్పటికే బీజేపీ కురువృద్ధుడు లాల్‌ కృష్ణ అద్వానీ తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని చెప్ప‌టం తెలిసిందే. వ‌యో భారంతో కొంద‌రు.. మోడీ తీరుతో పొస‌గ‌క మ‌రికొంద‌రు సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఏమైనా.. పాత నీటి స్థానే కొత్త నీరు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌థ్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక వెలుగు వెలిగిన నేత‌లంతా కాలానికి.. మీద ప‌డుతున్న వ‌య‌సు ఒత్తిడికి లొంగిపోవ‌టం చూస్తే.. ఎంత ప‌వ‌ర్ ఫుల్ అయినా కాలం ముందు మాత్రం అస్స‌లు నిల‌వ‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News