ఆనాడే జగన్‌ అలా చేసి ఉంటే విశ్వసనీయత పెరిగేది: ఉండవల్లి

Update: 2022-11-08 11:30 GMT
రాజధాని వ్యవహారంపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే దానికి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ పూర్తి మద్దతు ఇచ్చారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. జగన్‌ కూడా రాజధానిగా అమరావతికి అనుకూలంగా ఉండటంతో రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారని స్పష్టం చేశారు.

తనకు రాజధానిగా అమరావతి ఇష్టం లేకపోతే ఆనాడే జగన్‌ ఈ విషయం చెప్పి ఉండాల్సిదన్నారు. నాడు అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాజధానికి అనుకూలమని చెప్పడంతో రైతులు కూడా రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి తమ భూములిచ్చారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గుర్తు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ రాజధానికి అనుకూలంగా ఉండటంతో భవిష్యత్తులోనూ రాజధానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించే తమ భూములిచ్చారని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ఒప్పుకోకపోయి ఉంటే రైతులు భూములిచ్చేవారు కాదని స్పష్టం చేశారు.

ఇక ఇప్పుడు మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. రాజధాని అంశాన్ని సుప్రీంకోర్టే నిర్ణయిస్తుందని ఉండవల్లి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

నాడు రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే తప్పుపట్టిన వ్యక్తిని తానేనని ఉండవల్లి గుర్తు చేశారు. అమరావతి భ్రమరావతిగా మారుతుందని తాను ఆనాడే చెప్పానన్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాదని.. ఈ విషయాన్ని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నాన్చకుండా తేల్చిచెప్పినందుకు ఆయనను అభినందిస్తున్నానని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తాజా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అమరావతి రాజధానిగా ఇష్టం లేకపోతే ఆనాడే చెప్పి ఉంటే జగన్‌కు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తేవి కాదు. ఆనాడే తాము రాజధానిని వ్యతిరేకించామని చెప్పుకోవడానికి జగన్‌కు, వైసీపీ నేతలకు ఉండేది. తద్వారా జగన్‌ పదే పదే చెప్పుకునే విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేది.

అలా కాకుండా అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ తేనెతుట్టెను జగన్‌ కదపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. దీనివల్ల ఆయన విశ్వసనీయత కూడా దెబ్బతిందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాయి. జగన్‌ వైఖరితో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపిస్తున్నాయి.

ఇప్పుడు రాజధానిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు కాబట్టి వచ్చే ఎన్నికలు ఒకే రాజధాని వర్సెస్‌ మూడు రాజధానులుగా సాగుతాయని అంటున్నారు. ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారో తేలుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈలోగా సుప్రీంకోర్టు కూడా రాజధాని అంశాన్ని తేల్చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News