లగడపాటి పెప్పర్ స్ప్రే ముచ్చట చెప్పిన ఉండవల్లి

Update: 2016-07-19 10:02 GMT
అప్పుడెప్పుడో జరిగిపోయిన విభజన బిల్లు ముచ్చటను తాజాగా తనదైన శైలిలో చెప్పుకొచ్చారు ఏపీ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. ఎటకారంగా మాట్లాడటంలో ఆయన్ను కొట్టే వారు ఎవరూ ఉండరనే చెప్పాలి. లాజిక్కుల మీద లాజిక్కులు తీయటం.. మాటని తనదైన శైలిలో విరవటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి పెద్దమనిషి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇంగ్లిషులో విభజన గురించి రాసిన పుస్తకాన్ని తెలుగులో అచ్చేసి.. ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అన్నింటి కంటే ఎక్కువగా లగడపాటి పెప్పర్ స్ర్పే వ్యవహారం గురించి చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా ఆ ఇష్యూను మహా ఎటకారంగా చెప్పటం గమనార్హం. ఏదో ఒకటి జరగాలని.. అలా చేస్తే బిల్లు ఆగుతుందన్నట్లుగా చేశారన్నట్లుగా చెప్పటం గమనార్హం. దీనికి కొనసాగింపుగా.. ‘‘లేకపోతే ఆఖర్లో పెప్పర్ స్ర్పే కొట్టటం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇదేమైనా ఎలిమెంటరీ స్కూలా? పెప్పర్ స్ప్రే కొడితే ఆగిపోతుందా? అయినా.. కొట్టినోడు ఎవరు? ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే వీడేదో న్యూసెన్స్ చేద్దామని అనుకుంటున్నాడని అనుకోవచ్చు. కొట్టినోడు లగడపాటి రాజగోపాల్. 35వేల కోట్ల రూపాయిలు ఆంధ్రాలో బిజినెస్ మ్యాన్. అతనొచ్చి కొట్టాడంటే.. కొడితే ఆగుతుందన్న కాన్ఫిడెన్స్ లేకుంటే కొడతాడా? ఎవరు చెప్పి ఉంటారు.. కొడితే ఆగుతుందని..?  కాంగ్రెసోళ్లు చెప్పి ఉండాలి.. బీజేపీ వాళ్లు చెప్పి ఉండాలి. ‘ఏదో ఒకటి చేయండి.. ఆపేస్తామని. ఇవాల్టి వరకూ ఆ పెప్పర్ స్ప్రే ఘటన మీద విచారణ ఎందుకు జరపలేదు? చరిత్రలో తొలిసారి జరిగిన ఆ ఘటన మీద ఎంక్వయిరీనే లేదు’’ అని వ్యాఖ్యానించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ ను ఉద్దేశించి మరీ ఇంత ఎటకారంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు మాట్లాడటంగా చెప్పాలి. ఇదొక్కటే కాదు.. ఇదే మీటింగ్ లో విభజన జరిగి రెండేళ్లు అయినా హైదరాబాద్ లో చక్కగా ఉన్నామని.. కొత్తప్రాంతానికి వచ్చినట్లుగా లేదంటూ ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.

విభజన తర్వాతి అంశాల మీద ఇంత సానుకూలంగా రియాక్ట్ అయిన ఉండవల్లి.. అదే సమయంలో లగడపాటి మీద మాత్రం మహా ఎటకారంగా మాట్లాడటం వెనుక కారణం మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మధ్యనే ఉండవల్లిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కలవటం.. ఈ సందర్భంగా ఆయన జగన్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరగటం తెలిసిందే. అయితే.. తాను జగన్ పార్టీలో చేరటం లేదని ఉండవల్లి చెప్పినా.. కాంగ్రెస్.. బీజేపీపై నిందలు వేసేలా మాట్లాడటం ఎందుకు? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. పుస్తకం మాటేమో కానీ.. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఉండవల్లి చెప్పిన మాటలే ఎక్కువ సంచలనంగా మారాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News