మోడీ అపాయింటుమెంటే సాధించలేని బాబు ఇంకేం సాధిస్తారు

Update: 2017-11-04 01:30 GMT
చంద్రబాబును ఏకిపారేయడంలో పీహెచ్‌ డీ చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరోసారి అదే పనిచేశారు. ఏపీ సీఎంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమైపోయారు. చంద్రబాబు అసమర్థత వల్లే ఆంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోతోందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని - పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పదేపదే పెంచుతూ కాంట్రాక్టర్లకు పోలవరాన్ని వరంలా మార్చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాష్ర్టానికి ఏదో సాధిస్తారని అనుకున్నామని.. ఆయన కనీసం మోడీ అపాయింటుమెంటు కూడా సాధించలేకపోతున్నారని ఏకిపడేశారు.
    
అసలు కేంద్రం నిర్మిస్తానన్న ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ఉండవల్లి  ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్రం అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిర్మించాలని చట్టంలో ఉంటే చంద్రబాబు మాత్రం తానే కాంట్రాక్టర్‌ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత నిర్మాణ పనులు - నిధులు - ఇతర విషయాలు పరిశీలిస్తుంటే…. పోలవరం ప్రాజెక్టు 2018లోపు పూర్తవడం అసాధ్యమన్నారు.
    
అసలు కేంద్రంలో భాగస్వామిగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. రెండేళ్ల కాలంలో ఒక ముఖ్యమంత్రి ప్రధాని అపాయింట్‌ మెంట్‌ సాధించలేకపోవడానికి మించిన సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు ఉండవల్లి. పట్టిసీమ - పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు పోలవరంలో అంతర్భాగమని చంద్రబాబు చెబుతుంటే కేంద్రం మాత్రం వాటికి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధం లేదంటోందని…. ఇందులో ఏది నిజమో స్పష్టం చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News