పవన్ ను కాపాడే కృష్ణుడు.. జేపీనా? చంద్రబాబా?

Update: 2018-02-12 11:54 GMT

‘ధృతరాష్ట్ర కౌగిలి’ అనేది తెలుగు జాతీయం. బహుశా నవీన యువతరానికి దాని అర్థం తెలియకపోవచ్చు. కొద్దిగా అదేంటో తెలుసుకుందాం..

‘‘ధృతరాష్ట్రుడంటే గుడ్డివాడే కానీ మహా బల సంపన్నుడు. ఆయన ఎన్నడూ యుద్ధం చేసిన వాడు కాదు గనుక.. ఆయన బలం గురించి ఖ్యాతి రాలేదు. అలాగే ఆయన పుత్రవాత్సల్యం, సుయోధన ప్రేమ కూడా మామూల్ది కాదు. అలాంటి ధృతరాష్ట్రుడికి కురుక్షేత్ర సంగ్రామం విషాదాన్ని మిగిలించింది. నూర్గురు కొడుకులూ హతులయ్యారు. ప్రత్యేకించి పెద్దకొడుకు దుర్యోధనుడి చావును ఆయన జీర్ణించుకోలేకపోయారు. అయితే యుద్ధంలో గెలిచాక పాండవులంతా పెదతండ్రి ధృతరాష్ట్రుడి వద్దకెళ్లి దీవెనలు అడిగారు. ఆయనకేమో తన పెద్ద కొడుకును చంపిన భీముడి మీద కక్షఉంది. అందుకని.. ‘‘కుమారా భీమసేనా.. నిన్ను కౌగిలించుకోవాలని ఉంది.. ఓసారి ఇటురా’’ అని పిలిచాడు. భీముడు వెళ్లబోయే సరికి.. కృష్ణుడు వారించి.. పక్కనే ఉన్న ఒక ఉక్కు విగ్రహాన్ని ఆయన ఎదుటకు పంపాడు. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు దాన్ని కౌగిలించుకునే సరికి అది కాస్త నుగ్గు నుగ్గు అయిపోయింది. భీముడు నివ్వెరపోయాడు. ఆయనలో అంతలా భీముడిని చూర్ణం చేసేయాలన్నంత  పగ ఉన్నదన్నమాట. ఆయనకు అంతటి వార్ధక్యంలో అంతటి బలం ఉన్నదన్నమాట. ఆ రకంగా భీముడిని , కృష్ణుడు రక్షించాడు...’’ ఇదీ కథ!


ఇక ఇప్పటి రాజకీయాల్లోకి వద్దాం...


ఉండవిల్లి అరుణ్ కుమార్ జేఎఫ్‌సీలో భాగం కావడాన్ని వెటకారంగా విమర్శిస్తూ ఓ మంత్రిగారు ఆయనది ధృతరాష్ట్ర కౌగిలి అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఉండవిల్లి మాత్రం సరదాగానే తీసుకున్నారు. సోమవారం లోక్ సత్తా జేపీని కలిసిన ఆయన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తనది ధృతరాష్ట్ర కౌగిలి అయితే కావచ్చు గానీ.. దాని బారినుంచి పవన్ కల్యాణ్ ను  తప్పించగల శ్రీకృష్ణుడు రూపంలో ఎవరో ఒకరు ఉంటాడని ఆయన సెలవిచ్చారు.


అయితే ఇక్కడ సామాన్యుడికి సందేహం ఏంటంటే.. ఉండవిల్లి ధృతరాష్ట్రుడిలా దెబ్బ కొడతారు.. పవన్ కల్యాణ్ భీముడిలా దాని బారిన పడకుండా.. ఎవరో శ్రీకృష్ణుడిలా రక్షిస్తారు! ఇంతవరకు ఓకే.. మరి పవన్ ద్వారా రక్షించే కృష్ణుడు ఎవరు.. అది అంతిమంగా చక్రం తిప్పగల చంద్రబాబేనా..? లేదా ఈ జేఎఫ్ సీ కి నేతృత్వం వహిస్తున్న జేపీనా? అని పలువురు అనుకుంటున్నారు.

Tags:    

Similar News