జ‌గ‌న్ కు ఉండ‌వ‌ల్లి కొత్త స‌ల‌హా

Update: 2017-12-04 16:13 GMT
క్రియాశీల‌ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ...కీల‌క అంశాల‌పై సంద‌ర్భానుసారం త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ తాజాగా అదే రీతిలో స్పందించారు. ఓ మీడియా చాన‌ల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌ధాని మోడీ - ఏపీ సీఎం చంద్ర‌బాబు - విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ గురించి స్పందించారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి తమకు మిత్రుడైనంత మాత్రాన జగన్‌ పై తమకు ప్రేమ ఉందని, చంద్రబాబును విమర్శిస్తుంటానని మాట్లాడటం అర్థరహితమన్నారు. వైసీపీతో బీజేపీ క‌లుస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని అయితే...అలాంటి పొత్తు కుదిరితే వైసీపీ మ‌టాష్ అవుతుంద‌ని ఉండ‌వ‌ల్లి హెచ్చ‌రించారు. ఈ మిత్రుత్వం కుదిరితే వైఎస్ జ‌గన్‌ కు ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంద్నారు.  2014లో తొలుత జగన్‌ ను సంప్రదించి, అక్కడ పొత్తు కుదరకే బీజేపీ-టీడీపీ పొత్తు ఏర్ప‌డింద‌ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ఉండ‌వ‌ల్లి వివ‌రించారు.

తనతో పాటు ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితర కాంగ్రెస్ నేతలు జగన్‌ ను అధికారంలోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. దివంగ‌త వైఎస్ త‌న‌యుడిగా...జ‌గ‌న్ త‌మ‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుస‌ని అయితే పొత్తుల విషయంలో ఆయ‌న‌కు సలహా ఇచ్చే శక్తి తనకు లేదని ఉండవల్లి అన్నారు. జగన్‌ ను అధికారంలోకి తీసుకు వచ్చేంత సమర్థత తమ వద్ద లేదని నిర్మొహ‌మాటంగా చెప్పారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో జగన్ చేస్తున్న‌ పాదయాత్ర గురించి ఆలోచించడం లేదని - ఆ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి పీఠం వరకు తీసుకు వెళ్తుందా లేదా కూడా తెలియదని ఉండవల్లి అన్నారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఉండ‌వల్లి సెటైర్లు విసిరారు. బాబులో ఒక‌నాటి ఆవేశం లేద‌న్నారు. నరేంద్ర మోడీ హైదరాబాదులో కాలుపెడితే అరెస్టు చేయిస్తానని గతంలో చంద్రబాబు అన్నారని ఉండవల్లి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నోరును బీజేపీ నొక్కేసిందన్నారు. ఓటుకు నోటు కేసు వంటి వాటికి భయపడే చంద్రబాబు రాజీ పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఆ విషయం మరుగునపడ్డాక ఇప్పుడు చేసిన అప్పులకు లెక్కలు చెప్పలేక భయపడుతున్నారన్నారు.  బీజేపీ నేతలు తిడుతున్నా మెతక వైఖరి అవలంభిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటూ బీజేపీని ఏమీ అనవద్దని తమ పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నార‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పదింటిలో మూడు నెగ్గి, ఏడు ఓడినా ఓకే అనవచ్చు, కానీ ఆయన ఎక్కడ నెగ్గాడో చెప్పాలని ఉండవల్లి ప్రశ్నించారు. కేంద్రం నియమించిన గవర్నర్ ఉండగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంపై బాబుకు పట్టు లేదని...చంద్రబాబును ఎప్పటికి అఫ్పుడు అణిచివేసే ఆయుధాలు కేంద్రం వద్ద ఉన్నాయని ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు.కాంట్రాక్టులు - బిడ్డింగ్ ప్రక్రియ నుంచి కమీషన్లు తీసుకోవడం వరకు అంతా ఓ బ్రహ్మపదార్థం అని, దానిలో వేలుపెట్టని వాళ్లు ఉండరని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ - టీడీపీలు బురదజల్లుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తిపై భారీ సెటైర్ వేశారు. చంద్రబాబు  ప్ర‌చారం చేస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తాను చూడలేనని, అంత‌కాలం తాను జీవించి ఉండ‌లేన‌ని అన్నారు. చంద్ర‌బాబు 130 ఏళ్లు బతుకుతారేమోనని ఉండవల్లి ఎద్దేవా చేశారు. జన్యుపరంగా ఆయ‌న‌కు అద్భుత ల‌క్ష‌ణాలు వ‌చ్చి ఉంటాయేమోన‌ని ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపైనా ఉండ‌వ‌ల్లి ఆస‌క్తిక‌క‌ర‌మైన వ్యాఖ్యాలు చేశారు. మోడీకి పెళ్లాం - పిల్లలు లేరని, ఆయ‌న‌పై అవినీతి ఆరోపణలు కూడా లేవని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఆయ‌న‌కు రాజ‌కీయం మాత్ర‌మే తెలుసున‌ని పేర్కొంటూ ప్రధానిని చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేర‌ని ఎద్దేవా చేశారు. కానీ చంద్ర‌బాబుపై అన్నీ ఆరోప‌ణ‌లేన‌ని ఉండవల్లి ఎద్దేవా చేశారు. బీజేపీ ద్వ‌యం మోడీ - అమిత్ షాలు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, ఏపీపై వాళ్లకు ఎలాంటి ఆస‌క్తిలేద‌న్నారు. ఇది అనేక విష‌యాల్లో స్ప‌ష్ట‌మైంద‌ని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు.
Tags:    

Similar News