బాబుపై ఉండ‌వ‌ల్లి లాపాయింట్‌ లో లాజిక్ ఉందే

Update: 2017-05-21 09:39 GMT
ఏపీ నేత‌ల్లో విష‌యాల మీద సంపూర్ణ అవ‌గాహ‌న‌తో పాటు.. మంచి మాట‌కారిత‌నం.. లాజిక్ తో ఎదుటోళ్ల‌ను  ఇరుకున పెట్టే నేతల్లో ఒక‌రు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌. అయితే.. ఆయ‌న నేప‌థ్యంలో ఉన్న కార‌ణాల‌తో కావొచ్చు కానీ.. అగ్రెసివ్ గా మాట‌ల తూటాల్ని విస‌ర‌టం క‌నిపించ‌దు. అలాంటి ఉండ‌వ‌ల్లి తాజాగా త‌న‌దైన శైలితో చేస్తున్న లాజిక్ వ్యాఖ్య‌లు బాబు అండ్ కోకు మ‌హా ఇబ్బందిక‌రంగా మారాయన్న మాట వినిపిస్తోంది.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీని ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భేటీ కావ‌టంపై ఏపీ తెలుగు త‌మ్ముళ్లు భారీ హ‌డావుడి సృష్టించిన వైనాన్ని ప్ర‌స్తావించిన ఉండ‌వ‌ల్లి.. మోడీని జ‌గ‌న్ క‌లిస్తే త‌ప్పేమిటంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ ఇష్యూపై టీడీపీ నేత‌లది అన‌వ‌స‌ర రార్ధాంతంగా కొట్టిపారేశారు.

తెలుగుదేశం పార్టీ నేత‌ల మాట‌ల్ని చూస్తే.. వారికేదో భ‌యం ప‌ట్టుకున్న‌ట్లుగా అనిపిస్తోంద‌ని ఉండ‌వ‌ల్లి వ్యాఖ్యానించారు. గ‌తంలో గోద్రా ఇష్యూ జ‌రిగిన‌ప్పుడు మోడీ కానీ ఏపీకి వ‌స్తే అరెస్ట్ చేయిస్తాన‌ని అప్ప‌ట్లో సీఎంగా ఉన్న చంద్ర‌బాబు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఆ విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ మ‌న‌సులో పెట్టుకున్నారేమోన‌ని చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్న‌ట్లుగా త‌న‌కు అనిపిస్తోంద‌న్నారు. ఓటుకు నోటు.. అవినీతి కేసుల విష‌యంలో త‌న‌పై ప్ర‌ధాని చ‌ర్య‌లు తీసుకుంటార‌ని బాబు భ‌య‌ప‌డుతున్న‌ట్లుగా అనిపిస్తోంద‌న్నారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదాపై ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని.. రాజ‌ధాని లేని ఏపీ పొరుగు రాష్ట్రాల‌తో పోటీ ప‌డేలా సాయం చేయాల‌ని జ‌గ‌న్ విన్న‌విస్తే.. బాబుకు.. టీడీపీ నేత‌ల‌కు ఉలుకెందుకో చెప్పాల‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. విభ‌జ‌న హామీలపై ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్న ఉండ‌వ‌ల్లి.. సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టారంటూ ర‌వికిర‌ణ్‌ను అరెస్ట్ చేయ‌టాన్ని ఖండించారు. తాను కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాన‌ని.. త‌న‌ను కూడా అరెస్ట్ చేయాల‌న్నారు.

రానున్న రోజుల్లో జ‌గ‌న్ తో క‌లిసి మోడీ అండ్ కో క‌లిసి వెళ‌తార‌న్న‌ది టీడీపీ నేత భ‌యంగా అభివ‌ర్ణించిన ఉండ‌వ‌ల్లి..  అందుకే జ‌గ‌న్ పై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. 2004లో ప‌రిటాల ర‌వి హ‌త్య అనంత‌రం కాంగ్రెస్ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ను నాటి ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు భేటీ కావ‌టం.. నాటి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌త్య చేయించిన‌ట్లు ఆరోపించ‌టం మ‌ర్చిపోయారా? అన్నారు. నాడు చంద్ర‌బాబు ప్ర‌ధానిని క‌లిసి నాటి సీఎం మీద ఫిర్యాదు చేయొచ్చు కానీ.. ఇప్ప‌టి ప్ర‌ధానితో ఏపీ విప‌క్ష  నేత భేటీ అయి.. రాష్ట్రంలో నెల‌కొన్న అంశాల్ని మాత్రం చ‌ర్చించ‌కూడ‌దా? అంటూ త‌న‌దైన లాజిక్‌ను బ‌య‌ట‌కు తీశారు. అందుకే అనేది.. ఉండ‌వ‌ల్లి.. ఉండ‌వ‌ల్లేన‌ని.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News