2018 బడ్జెట్ కు.. టీడీపీ పతనానికి లింకేమిటి?

Update: 2016-10-21 09:48 GMT
ఏపీ సుబ్రహ్మణ్య స్వామి అంటూ కొందరు సరదాగా పిలిచే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.  చంద్రబాబు విధానాల కారణంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలనూ తప్పు పట్టిన ఆయన వాటిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

చంద్రబాబు తీరు సరిగా లేదని.. సీనియర్‌ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ లాంటి వారిని కూడా ఉన్మాదితో పోల్చిన ఘనత ఆయనకే దక్కిందని విమర్శించారు. 2018 బడ్జెట్ తర్వాత టీడీపీలో చాలా వికెట్లు పడతాయని ఆయన జోష్యం చెప్పారు. చంద్రబాబు విధానాలే పతనానికి నాంది పలుకుతాయని చెప్పారు. అయితే.. 2018 బడ్జెట్ ను డెడ్ లైన్ గా ఎందుకు పెట్టారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ ఓటుకు నోటు కేసుపైనా ఉండవల్లి స్పందించారు. రేవంత్ రెడ్డి ఎవరినైనా డూప్ గా పెట్టుకుంటే తప్ప ఆ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదన్నారు. అవిశ్వాసం సమయంలో యనమల రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. అవిశ్వాసం ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్‌ స్థానంలో కూర్చోవడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఊహించడం బ్రహ్మంగారికి కూడా సాధ్యమయ్యే పనికాదన్నారు. మరి 2018 తరువాత ఉండవల్లిచెప్పినట్లుగా ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి.
Tags:    

Similar News