బాబూ అవ‌కాశం ఉంది నిరూపించుకో- ఉండ‌వ‌ల్లి

Update: 2018-05-11 11:35 GMT
రాజకీయాలలో లేనని ప్రకటించినప్పటికీ తరచూ చంద్రబాబుపై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటాడు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. అయితే ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖను రాశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తాను సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌ కు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని, తాను విభజన అంశంపై వేసిన పిటిషన్‌ పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదని అందులో పేర్కొన్నారు.
    
ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు పిటీషన్ దాఖలు చేస్తే కేంద్రానికి గట్టిగా బుద్ది చెప్పొచ్చని ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న ఎన్‌ డీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం విడిపోయిన నేపథ్యంలో చంద్రబాబు పిటీషన్ దాఖలు చేస్తే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్రం తన పిటీషన్‌పై ఇప్పటివరకు స్పందించలేదని, అఫిడవిట్ దాఖలు చేయలేదంటూ దుయ్యబట్టారు. అందువల్ల ఇది మంచి అవకాశం అని వెంటనే చంద్రబాబు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల ఎంతో నష్టం జరిగిందని, ఇంకా కూడా మౌనంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు

 ఆంధ్రప్రదేశ్ విభజన అశాస్త్రీయమైనదని, ఇది కోర్టుల్లో నిలవదంటూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి - ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో పిటీషన్ వేయగా పిటీషన్‌ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉండవల్లి లేఖతో ఈ విషయం మళ్ళీ చర్చకు వచ్చింది. చూడాలి మరి చంద్రబాబు ఈ లేఖపై ఎలా స్పందిస్తారో!
Tags:    

Similar News