మునుగోడు గోడు : అమిత్ షాకు సీన్ అర్ధమైందా...?

Update: 2022-09-18 05:46 GMT
కొండంత రాగం తీసి కూని పాట పాడినట్లుగా ఇపుడు మునుగోడులో కమలం పాల పొంగు చల్లారినట్లుగా కనిపిస్తోంది. ఏ కారణం లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం అతి పెద్ద మైనస్ అయితే ఆయన గారు  ఎన్నికలకు ఏడాది ముందు వరకూ చూసి అపుడు కాడె వదిలేయడమే జనాలకు బాగా  కోపంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి.

దీంతో టీయారెస్ ఏమీ చేయలేదని బీజేపీలో చేరినట్లుగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నా జనాలకు అది పట్టడంలేదు. పైగా మునుగోడు చరిత్రలో ఏనాడూ బీజేపీ గెలిచింది లేదు కదా గట్టిగా మంచి ఓట్లు కూడా రాలేదు. మరో వైపు పార్టీ కంటే తాను ఎక్కువ తన వల్లే మునుగోడు గెలుపు అని రాజగోపాల్ రెడ్డి భావించి చేసిన అతిశయం కూడా ఇపుడు రివర్స్ అవుతోంది

ఆయన వెంట కాంగ్రెస్ శ్రేణులు గుత్తమొత్తంగా రావడానికి రెడీగా లేరు. మరో వైపు కాంగ్రెస్ కూడా మంచి ఫైటింగ్ ఇచ్చేలా సీన్ మారుతోంది. ఎటూ టీయారెస్ కి అధికార బలం ఉంది. దానికి ఉభయ వామపక్షాలు హెల్ప్ అవుతున్నాయి. దాంతో మునుగోడులో బీజేపీకి థర్డ్ ప్లేస్ అని సర్వేలు ఘోషిస్తున్న వేళ హైదరాబాద్ లో అడుగుపెట్టిన అమిత్ షాకు సీన్ మొత్తం అర్ధమైందిట.

వచ్చింది హైదరాబాద్ విమోచనా దినోత్సవానికైనా ఆయన మొత్తం చూపు మునుగోడు మీదనే ఉంది. ఎలాగైనా ఈ సీటు గెలవాలి. ఇదే ఇపుడు అమిత్ షా తెలంగాణా బీజేపీ శ్రేణులకు ఇచ్చిన సందేశం, కాదు ఆదేశం. దాని కోసం ఏం చేయాలో చేయాల్సిందే అని ఆయన అంటున్నారు. ఇంకో వైపు మునుగోడులో బీసీ ఓటింగ్ అరవై శాతం ఉంది. దాంతో పాటు టీయారెస్ బలంగా ఉంది. అందువల్ల అక్కడ ఈటెల రాజేందర్ ఫ్యాక్టర్ ని వాడాలని కూడా అమిత్ షా సిద్ధపడుతున్నారని అంటున్నారు.

ఆయన బీసీ నేత కావడం, టీయారెస్ గుట్టుమట్లు తెలియడంతో ఆయన్ని ముందు పెట్టి మునుగోడులో పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయిల నుంచి మండలాల దాకా ఇంచార్జిలను బలమైన వారిని నియమించాలని కూడా అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. ఆలగే వీలైతే సినీ నటులను బీజేపీకి పరిచయం ఉన్న వారిని వాడుకోవాలని కూడా షా పార్టీ వర్గాలకు సూచించారుట.

మొత్తం మీద మునుగోడులో అట్టహాసంగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను రాజీనామా చేయించి తమ వైపు తెచ్చుకుని కండువా కప్పినంత ఈజీ కాదు ఉప ఎన్నికల్లో గెలవడం అన్నది అపరచాణక్యుడు అయిన అమిత్ షాకు బాగా అర్ధమయ్యేసరికి మునుగోడులో బీజేపీ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళి పుట్టె మునగబోతోందిట. చూడాలి మరి షా మంత్రాంగం ఏ మేరకు పనిచేస్తుందో. తెలంగాణా బీజేపీ ఎలా సర్దుకుంటుందో.
Tags:    

Similar News