అనారోగ్యంతో కేంద్ర‌మంత్రి క‌న్నుమూత‌!

Update: 2018-11-12 04:34 GMT
మోడీ మంత్రివ‌ర్గంలోని మంత్రి ఒక‌రు క‌న్నుమూశారు. కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌ర్ణాట‌క‌కు చెందిన అనంత్ కుమార్ అస్వ‌స్థ‌త‌తో  ఈ రోజు (సోమ‌వారం) తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. గ‌డిచిన కొద్దికాలంగా ఆయ‌న ఆనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. బెంగ‌ళూరులోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల ప్రాంతంలో మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న అనంత‌కుమార్ 1959 జులై 11న పుట్టారు. విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొన్న బ్యాక్ గ్రౌండ్ ఆయ‌న సొంతం. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న 1996లో తొలిసారి ఎంపీగా లోక్ స‌భ‌కు ఎన్నిక అయ్యారు.

వాజ్ పేయ్ ప్ర‌భుత్వంలో కేంద్ర విమాన‌యాన శాఖామంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న తాజాగా మోడీ స‌ర్కారులోనూ కేంద్ర‌మంత్రిగా స్థానం ల‌భించింది. 59 ఏళ్ల చిన్న వ‌య‌సులోనే ఆయ‌న మ‌ర‌ణించ‌టం షాకింగ్ గా మారింది. మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న కేబినెట్‌ లోని ప‌లువురు మంత్రులు తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌టం.. కొంద‌రు మ‌ర‌ణించ‌టం జ‌రిగింది.

అనంత్‌ కుమార్ విష‌యానికి వ‌స్తే.. కొంత‌కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధ ప‌డుతున్న ఆయ‌నకు కొద్ది రోజుల క్రితం అమెరికాలో చికిత్స పొందారు. అనంత‌రం బెంగ‌ళూరులోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం మొద‌లు పెట్టిన నాటి నుంచి అనంత్ కుమార్ ఇప్ప‌టివ‌ర‌కూ ఆరుసార్లు ఎంపీగా ఎన్నిక కావ‌టం గ‌మ‌నార్హం.  


Tags:    

Similar News