కేటీఆర్ జ‌ల‌సీ ట్వీట్‌ కు కేంద్ర‌మంత్రి రిప్ల‌యి

Update: 2018-08-07 10:57 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత చురుకుగా స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న స‌ర‌దా సంభాష‌ణ‌ల నుంచి మొద‌లుకొని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం వ‌ర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గానే కానిచ్చేస్తుంటారు. తాజాగా కేంద్రంపై కూడా ట్విట్ట‌రు సంప్ర‌దింపులు మొద‌లుపెట్టారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే...బెంగళూరులో మౌలిక సదుపాయాల కోసం రక్షణశాఖ భూమిని కేంద్రం రాష్ట్రం కోసం బదలాయించింది. అయితే తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నంగా రక్షణశాఖ భూముల అప్పగింత విషయంలో కేంద్రప్రభుత్వం అనుస‌రిస్తున్న‌ వైఖరిపై రాష్ట్ర ఐటీ - పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పొరుగురాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో అవలంబించిన విధానమే తెలంగాణకు వర్తింపచేయాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖను కోరారు. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం పలుచోట్ల స్కైవేలు - ఎక్స్‌ ప్రెస్‌ వేలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు స్కైవేల నిర్మాణానికి రక్షణశాఖ భూములు అడ్డుగా ఉండటంతో వాటిని అప్పగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని - రక్షణశాఖను కోరుతున్నప్పటికీ రెండేళ్లుగా పెండింగ్‌ లో పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ లో స్పందిస్తూ ``బెంగళూరులో మౌలిక సదుపాయాల కోసం రక్షణశాఖ భూమిని కేంద్రం బదలాయించింది. ఇదే తరహాలో హైదరాబాద్‌ లోనూ బదలాయించాలని కోరుతున్నాం. స్కైవేల నిర్మాణానికి 160 ఎకరాల రక్షణశాఖ భూములు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రెండేండ్లుగా అడుగుతున్నాం. కేంద్రం నుంచి స్పందన లేనందున వాటి నిర్మాణం ఆగిపోయింది. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం ``అని మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

అయితే, కేటీఆర్ ట్వీట్‌ - రక్షణ శాఖ భూముల బదలాయింపు విషయంపై.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై తమకు ఎలాంటి సంశయం లేదన్నారు. అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని కేంద్రమంత్రి వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ సైతం తిరిగి స్పందించారు. మంత్రి నిర్మలా సీతారామన్‌ కు కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్‌.. కొంచెం త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని కోరారు. మొత్తానికి ట్విట్ట‌రు వాడే పొలిటీషియ‌న్ల‌లో కేటీఆర్ మ‌రీ చురుగ్గా ఉంటున్నారు.
Tags:    

Similar News