అమెరికా మ‌ళ్లీ ష‌ట్‌ డౌన్ అయింది

Update: 2018-02-09 17:34 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా మ‌ళ్లీ ష‌ట్ డౌన్ అయింది. అమెరికా బడ్జెట్‌ కు శుక్రవారం సెనెట్‌ ఆమోదం తెలిపినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గురువారం బడ్జెట్‌ కు సెనెట్‌ లో ఆమోదం పొందేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అర్ధరాత్రి నుంచే ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. అమెరికా చరిత్రలో ఒకే ఏడాది ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయడం రెండోసారి. గత నెలలో మూడు రోజుల పాటు అమెరికాలో ప్రభుత్వ కార్యాలయాలు మూత పడిన సంగతి తెలిసిందే.

సెనెటర్ల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తామని రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు పేర్కొన్నా - అర్ధరాత్రి వరకు సెనెటర్లు బిల్లుకు ఆమోదం తెలుపలేదు. బడ్జెట్‌ కు ఆమోదం కావాలంటే 100 మంది సెనెటర్ల మధ్య ఏకాభిప్రాయం అవసరం. కానీ 71- 28 తేడాతో బడ్జెట్‌ బిల్లుకు శుక్రవారం తెల్లవారుజామున సెనెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో మళ్లీ బడ్జెట్‌ బిల్లును కాంగ్రెస్‌ (ప్రజాప్రతినిధుల సభ)లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా, లక్షల మంది ఫెడరల్‌ సిబ్బంది శుక్రవారం విధులకు హాజరు కావాలా? వద్దా? అన్న విషయం గురువారం అర్ధరాత్రే తమ సంస్థల యాజమాన్యాలు - అధికారులతో సంప్రదించాలని అమెరికా సిబ్బంది యాజమాన్య శాఖ కార్యాలయం సూచించింది.

సెనెట్‌ లో కెంటకీ రిపబ్లికన్‌ సెనెటర్‌ రాండ్‌ పాల్‌ తొమ్మిది గంటల పాటు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యయ బడ్జెట్‌ లో లోటు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్చ శుక్రవారం తెల్లవారుజాము వరకు సాగింది. రాండ్‌ పాల్‌ సుదీర్ఘ ప్రసంగం వల్ల సహచర సెనెటర్లు కూడా ఒత్తిడికి గురయ్యారు. వచ్చే రెండేండ్ల పాటు రుణాలతో మిలిటరీ - పౌర సేవల వ్యయాన్ని 300 బిలియన్‌ డాలర్లకు పెంచాల్సిన అవసరమేమిటని పాల్‌ ప్రశ్నించారు. ఇది ఖజానాను దోపిడీ చేయడమేనని వ్యాఖ్యానించారు.
 
Tags:    

Similar News