స‌ర్వే షాక్: ఏపీకి శాపంగా ఆ రోగం!

Update: 2018-08-19 05:11 GMT
ఐక్య‌రాజ్య స‌మితి తాజాగా విడుద‌ల చేసిన ఒక నివేదిక షాకింగ్ గా మారింది. దేశంలోని రాష్ట్రాల్లో కెల్లా.. ఏపీలో మాన‌సిక వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య ఎక్కువ‌ని తేల్చింది. ఏపీలో మానసిక వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ త‌ర‌హా వ్యాధులు న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనే ఎక్కువ‌గా ఉంటాయి. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఏపీలో ప‌ల్లెల్లోనూ ఈ వ్యాధి అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్న వైనాన్ని గుర్తించారు.

సామాజిక‌.. ఆర్థిక‌.. కుటుంబ కార‌ణాల‌తో మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంద‌ని.. అందుకు త‌గిన వైద్యం మాత్రం అంద‌టం లేద‌ని వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు తాము ఎదుర్కొంటున్న మాన‌సిక వ్యాధికి సంబంధించిన చికిత్స‌కు ఆర్ ఎంపీల‌ను సంప్ర‌దించ‌టం.. వారికి ఆ స‌మ‌స్య‌పై అవ‌గాహ‌న లేక‌పోవ‌టంతో.. ఇష్యూ మ‌రింత జ‌టిల‌మ‌య్యే ప‌రిస్థితి.

దేశంలో మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బాధ ప‌డే రోగుల సంఖ్య ఏపీలోనే ఎక్కువ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏటా ప్ర‌తి వెయ్యి మందిలో 102 నుంచి 104 మంది కొత్త రోగులు ఏదో ఒక మాన‌సిక స‌మ‌స్య‌తో వైద్యుల వ‌ద్ద‌కు వెళుతున్న వైనం వివిధ స‌ర్వేల్లో వెల్ల‌డైంది. ఏపీలోని ఆరు కోట్ల మందిలో దాదాపు 50 ల‌క్ష‌ల‌కు పైనే ఏదో ఒక మాన‌సిక రుగ్మ‌త‌తో బాధ ప‌డుతున్న విష‌యాన్ని గుర‌త్ఇంచారు.
 
ఇది మ‌రింత తీవ్ర‌మై.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తోంది. షాకింగ్ అంశం ఏమంటే.. మాన‌సిక ఆందోళ‌న‌ల‌కు గురి అవుతున్న వారి వ‌య‌సు 16 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య‌లోని వారిగా గుర్తించారు. మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న వైనాన్ని ఎలా గుర్తించాల‌న్న దానిపై కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలను చెబుతున్నారు. అలాంటి వాటిని చూస్తే..

+ ఎదుటివారితో పోల్చుకుంటూ వారికంటే తక్కువగా ఉన్నామని బాధపడటం

+ ఆర్థిక - కుటుంబ కారణాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవడం

+  తనకేమైనా ఆపద వస్తుందేమోనని ముందే భయపడి ఒత్తిడికి గురవడం

+ ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు లోనవడం

+ జనంలో ఇమడలేక - ఒంటరిగా ఉండలేక ఒత్తిడికి గురవడం

+ చదువులతో ఒత్తిడికి గురై విద్యార్థులు మానసిక ఆందోళనతో ఉండటం

+ జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోతున్నామని ఆందోళనకు గురవడం

ఆత్మహ‌త్య‌లు చేసుకుంటున్న వారిలో 80 శాతం మంది స‌రైన కౌన్సెలింగ్ లేక‌పోవ‌టం లేద‌న్న విష‌యాన్ని గుర్తించారు. ఏపీలో మాన‌సిక చికిత్సాల‌యం విశాఖ‌ప‌ట్నంలో మాత్ర‌మే ఉండ‌టం.. మ‌రెక్క‌డా స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. తాము ప‌డే మాన‌సిక రుగ్మ‌త‌ల‌ను వ్యాధిగా గుర్తించి.. దానికి చికిత్స తీసుకోవాల‌న్న అవ‌గాహ‌న లేక‌పోవ‌టం మ‌రో కార‌ణంగా చెప్పాలి. ఇది కూడా వ్యాధిని మ‌రింత ఎక్కువ చేసేందుకు కార‌ణ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. మ‌రో కీల‌క‌మైన అంశం ఏమంటే.. మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు చికిత్స తీసుకోవ‌టం చిన్న‌త‌నంగా భావించే వారి సంఖ్య కూడా ఎక్కువే. అదే.. ఇష్యూను మ‌రింత పెంచుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మాన‌సిక రుగ్మ‌త‌ల‌కు చికిత్స తీసుకోవ‌టం త‌ప్పేం కాద‌న్న భావ‌న పెంచేలా ప్ర‌భుత్వం  పెద్ద ఎత్తున అవగాహ‌న కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News