టీడీపీ పగ్గాలు చంద్రబాబుకు ఎందుకు అప్పగించావ్.. బాలయ్యకు మోహన్ బాబు షాకింగ్ ప్రశ్న

Update: 2021-10-31 09:56 GMT
నందమూరి తారకరామారావు.. తెలుగు తెరపై తరగని సినిమా రారాజు. రాజకీయాల్లోకి వచ్చి పేదల ఆశాదీపంగా మారారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ కు కొత్త సొబుగులు దిద్దారు.అయితే రాజకీయాల్లో ఆయన గెలుపోటములు సంగతి పక్కనపెడితే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మాత్రం ఇప్పటికీ మాయని మచ్చగా మారింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ను కూలదోసి చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించి నందమూరి ఫ్యామిలీ తోడుగా నిలిచిన తీరు ఇప్పటికీ ఆక్షేపనీయమే. స్వయంగా ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలక్రిష్ణ, హరికృష్ణలు చంద్రబాబు చేతుల్లో తెలుగుదేశం పార్టీని పెట్టేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా కూడా బావ చంద్రబాబుకే పట్టం కట్టారు. ఇదో మిస్టరీ.. హరికృష్ణ, బాలక్రిష్ణలు తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకోకుండా ఎందుకు బాబుకు అప్పగించారన్నది ఇప్పటికీ అందుబట్టని వ్యవహారమే.. దాన్ని తాజాగా బయటపెట్టారు.

టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలక్రిష్ణ తొలిసారి బుల్లితెరపై 'అనస్టాపబుల్ విత్ ఎన్ బి కే' అంటూ ఒక షోతో అలరించడానికి వస్తున్నారు. 'ఆహా' ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ టాక్ షో ఇప్పటికే విడుదలైన ప్రోమోలతో బాలయ్య అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు. ఈ టాక్ షోకి ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రెటీలను అతిథులుగా తీసుకొచ్చారు.

ఈ షోకు ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు రాగా.. ఆయనతోపాటు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మీ కూడా విచ్చేశారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోలో బాలయ్య కౌంటర్లకు.. మోహన్ బాబు ఎన్ కౌంటర్లతో ఆసక్తికరంగా సాగిందని అర్థమవుతోంది. ముఖ్యంగా బాలక్రిష్ణ టీడీపీలో, మోహన్ బాబు వైసీపీలో ఉండడంతో వీరి మధ్య జరిగిన పొలిటికల్ సంభాషన ఆసక్తిరేపింది.

నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు అని మోహన్ బాబు అడగడం ఇప్పుడు ఈ షోలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకూ బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అయితే బాలయ్య షోలో కోపంగా సమాధానం ఇచ్చాడు. అదేంటన్నది హైడ్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబుకు ఏం సమాధానం చెబుతాడన్నది ఆసక్తి రేపుతోంది. ఇక వైసీపీలోకి ఎందుకు మారారు? ఎందుకు జగన్ సైడ్ నిలబడ్డారని బాలయ్య అడగడంతో ఇలా మోహన్ బాబు కౌంటర్ ఇచ్చాడు. ఇక చిరంజీవితో విభేదాలపై బాలయ్య ప్రశ్నించగా.. 'ఈప్రశ్న అల్లు అరవింద్' అడగమన్నాడా? అని మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు.

ప్రాణసమానమైన అన్నగారి పార్టీని మీరెందుకు వదిలేశారు అని మోహన్ బాబును బాలయ్య కూడా ఎదురు ప్రశ్నించారు.. ఎవరో ఫిటింగులు పెట్టారు.. అందుకే బయటకొచ్చానని మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అసలు ఈ ఆసక్తికర ప్రశ్నలకు మోహన్ బాబు ఏం సమాధానాలు ఇచ్చాడన్నది షోలోనే చూడాలి. నవంబర్ 4 నుంచి ఆహా ఓటీటీలో దీపావళి కానుకగా ఈ షో ప్రసారం కానుంది.
Tags:    

Similar News