తొందరలో మరో సంక్షోభం తప్పదా ?

Update: 2022-05-30 15:30 GMT
దేశవ్యాప్తంగా తొందరలోనే మరో విద్యుత్ సంక్షోభం వచ్చే ప్రమాదముందా ? అవుననే చెబుతోంది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (క్రియా). క్రియా అనేది విద్యుత్ రంగంలోని లోటుపాట్లు, విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు, రవాణా తదితరాలపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తు నివేదికలు తయారు చేసే స్వతంత్ర సంస్థ. క్రియా తన తాజా నివేదికలో దేశంలో పిట్ హెడ్ విద్యుత్ ప్లాంట్ల దగ్గర 1.35 కోట్ల టన్నులు, అన్నీ ప్లాంట్ల దగ్గరా కలిపి 2.05 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు తెలిపింది.

విద్యుత్ డిమాండ్ ఏమాత్రం పెరిగినా ఇపుడున్న బొగ్గు నిల్వలు ఏ మాత్రం తట్టుకోలేవని ఈ సంస్ధ స్పష్టంగా హెచ్చరించింది. అందువల్ల భవిష్యత్తును ముందే ఊహించి అవసరానికి మించి బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గర ఉంచుకోవాలని చెప్పింది.

తమ అధ్యయనం ప్రకారం రాబోయే జూలై-ఆగష్టు నెలల్లో దేశవ్యాప్తంగా మరో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తంచేసింది. ఆగస్టులో అత్యధికంగా దేశంలో 214 గీగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండబోతోందని క్రియా అంచనా వేసింది.

బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నా, తవ్వకాలు జరుగుతున్నా ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సరఫరా చేయలేకపోవటమే అసలైన సమస్యగా మారిందట. బొగ్గు నిల్వలున్నపుడు, తవ్వకాలు జరుగుతున్నపుడు ఎందుకని బొగ్గు సరఫరా జరగటంలేదన్నదే అసలైన సమస్య. ఎందుకంటే బొగ్గు తవ్వకాలన్నది డిమాండును బట్టే ఉంటుంది.

డిమాండంటే అన్నీ రాష్ట్రాల నుండి వచ్చే ఇండెంట్ ప్రకారమే లెక్కేస్తారు. మరి ఇండెంట్లు వస్తు, డిమాండ్ ఫుల్లుగా ఉండి తవ్వకాలు జరుగుతుంటే మరి తవ్విన బొగ్గంతా ఇండెంట్ల ప్రకారం రాష్ట్రాలకు అందకుండా ఎక్కడికి వెళుతోంది ?

2020-21లో దేశంలో 71.6 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తయ్యింది. 2021-22లో 77.72 కోట్ల టన్నులకు పెరిగింది. 2021-22లో దేశవ్యాప్తంగా 150 టన్నుల బొగ్గు తవ్వకాలకు అవకాశమున్నా ఇందులో సగం మాత్రం తవ్వగలిగారు. 2020 మే నుండి అన్నీ ప్లాంట్ల దగ్గరా బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయట. మామూలుగా ప్రతిప్లాంటు విద్యుత్ ఉత్పత్తికి  21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను దగ్గరే ఉంచుకోవాలి. మరి క్రియా తాజా నివేదికను చూస్తుంటే మరో సంక్షోభం తప్పదనే అనిపిస్తోంది.
Tags:    

Similar News