వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల మౌనం వెనుక ఏం జ‌రిగింది..?

Update: 2022-05-10 05:34 GMT
వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు మౌనంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పార్టీపైనా.. అటు అధినేత జ‌గ‌న్‌పైనా.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌న‌కెందుకులే..! అని మౌనంగా ఉంటున్నారా?  లేక మరేదైనా కార‌ణం ఉందా?  అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. పార్టీలో ఉన్న వారంతా కూడా జ‌గ‌న్‌కు, ముఖ్యంగా వైఎస్‌కు క‌ర‌డు గ‌ట్టిన అభిమానులు. గ‌తం  లో అంటే.. ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత‌.. ముందు కూడా.. వైసీపీ నేత‌లు.. తీవ్ర‌స్థాయిలో విజృంభించారు. జ‌గ‌న్‌ను ఎవ‌రైనా ఒక్క మాట అన్నా కూడా ఏ ఒక్క‌రూ ఊరుకునే వారు కారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంత‌పురం వ‌ర‌కు కూడా తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయేవారు.

ఎక్క‌డా రాజీ ప‌డే వారు కారు. అలాంటి నాయ‌కులు.. గ‌త కొన్నాళ్లుగా మాత్రం మౌనంగా ఉంటున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నుంచి కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి కానీ.. ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వారు పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా మంత్రి వ‌ర్గాన్ని మార్చుకుని జ‌గ‌న్ 2.0 కేబినెట్ ఏర్పాటు చేసుకున్న త‌ర్వాత‌.. అప్ప‌టి వ‌రకు అంతో ఇంతో యాక్టివ్ గా ఉన్న నాయ‌కులు కూడా మౌనంగా ఉంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న కొడాలి నాని, పేర్ని నాని వంటివారు.. ఎవ‌రి విష‌యంలో అయినా.. కౌంట‌ర్లు ఇచ్చేవారు. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు.

దీంతో పార్టీని ఎవ‌రైనా ఏమైనా అనాల‌ని అంటే.. కొంత ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. వైసీ పీ నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ కావ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా.. జ‌గ‌న్ వ్యూహ‌మేన‌ని, ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రేపు టికెట్లు ఇవ్వాలంటే.. ఖ‌చ్చితంగా ఎమ్మెల్యేల  ఫీడ్ బ్యాక్‌ను బ‌ట్టే ఇస్తామ‌ని చెబుతున్నారు. ఇది ప్ర‌జాప్ర‌తినిధులకు ప్రాణ‌సంక‌టంగా మారింది. పైగా.. అంద‌రూ జ‌గ‌న్ ఇమేజ్‌తో నే విజ‌యం ద‌క్కించుకున్నామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ విష‌యంలోనూ..జ‌గ‌న్ యూట‌ర్న్ తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌లు స‌రే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరే పార్టీని గెలిపించాలి.. అని ఆయ‌న తేల్చి చెబుతున్నారు.

దీనిని క‌న్ఫ‌ర్మ్ చేసుకుని ముందుకు సాగుదామా? అంటే.. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై 2019-20 మ‌ధ్య ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు. దీనికి క‌ర్ణుడి చావుకు కోటి కార‌ణాలు అనేలా.. అనేక రీజ‌న్స్ క‌నిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి లేదు., ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాప్ర‌తినిదుల‌కు మ‌ధ్య ఉండాల్సిన సున్నిత‌మైన‌.. బంధం కూడా లేదు. అంతా వ‌లంటీర్లే చూసుకుంటున్నా రు. కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ ఏమీ చేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పోనీ.. సొంత నిధులు ఖ‌ర్చు చేసుకుని.. వీటిని బ‌లోపేతం చేసుకుందా మ‌న్నా.. ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రూపాయి కూడా రావ‌డం లేదు. వ‌చ్చే ఎమ్మెల్యే జీతం త‌ప్ప‌.. ఇంకేమీ వారికి ద‌క్క‌డం లేదు.

మ‌రోవైపు... జ‌గ‌న్‌పైనా.. ఆయ‌న ఇమేజ్‌పైనా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఒక్క ఛాన్స్ అంటూ.. త‌మ‌పై అద‌న‌పు భారాలు మోపుతున్నార‌నే వాద‌న ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది. చెత్త‌ప‌న్ను.. ఇంటి ప‌న్నులు పెంచ‌డం.. పెట్రో ధ‌ర‌లు వంటివి కీల‌క ప్ర‌భావం చూపుతున్నాయి. అంటే.. రెండు వైపులా.. కూడా ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆశ‌లు చిగురించ‌డం లేదు. జ‌గ‌న్ ఇమేజ్ న‌మ్ముకుందా మ‌ని అంటే.. అది దాదాపు అడుగంటేసింద‌నే భావ‌న వారిలో ఉంది. పోనీ.. సొంత ఇమేజ్ చూసుకుందామంటే.. ఇది కూడా ఇప్ప‌ట్లో పుంజుకునేలా క‌నిపించ‌డం లేదు. పోనీ.. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌నే భావ‌న అసలు అధిష్టానం నుంచి మ‌చ్చుకు కూడా క‌నిపించ‌డం లేదు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రేపు త‌మ‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే.. ఏం చేయాలి?  అనేదివారి వాద‌న‌. ఎంతైనా రాజకీయ నేత‌లు.. ఎవ‌రి అవ‌స‌రం.. ఎవ‌రి అవ‌కాశం వారికి ముఖ్యం. సో.. ఇప్పుడు అటు జ‌న‌సేన‌పై విరుచుకుప‌డినా.. ఇటు టీడీపీపై విరుచుకుప‌డినా.. 'వ‌చ్చే అవ‌కాశం' చేజేతులా తోసిపుచ్చుకున్న‌ట్టుగానే ఉంటుంద‌ని వారేమైనా భావిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే.. త‌మ సౌఖ్యం త‌మ లాభం కోసం.. మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ఇప్పుడు మారాల్సింది ఎవ‌రు? అంటే.. జ‌గ‌నే అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రి ఆయ‌న మార‌తారా?  లేక‌.. ఏం జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది.
Tags:    

Similar News