జ‌న‌సేన‌తో బీజేపీ క‌టీఫ్ యేనా?

Update: 2022-07-05 03:29 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కాళ్ల మండ‌లం పెద అమిరంలో అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు.. టీడీపీ, జ‌న‌సేనను కూడా ఆహ్వానించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (పీఎంవో) చెప్పిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారిని ప్రొటోకాల్ ప్ర‌కారం పిల‌వ‌కుండా అవ‌మానించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్ల‌ను రానీయ‌కుండా సాంకేతిక స‌మ‌స్య‌ను కార‌ణంగా చూపింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడికి క్ష‌మాప‌ణ చెప్పార‌ని చెబుతున్నారు.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌ల‌సి న‌డ‌వాల‌ని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించుకున్నార‌ని బీజేపీ అధిష్టానానికి సంకేతాలు వ‌చ్చాయ‌ని పేర్కొంటున్నారు. అందుకే బీజేపీ అధిష్టానం ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌లేద‌ని చెబుతున్నారు.

అంతేకాకుండా బీజేపీ పెద్ద‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అందుకే అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని అంటున్నారు. ప‌వ‌న్ టీడీపీతో క‌ల‌సి వెళ్లాల‌నుకోవ‌డం బీజేపీకి ఇష్టం లేద‌ని స‌మాచారం. అందుకే ఏపీ బీజేపీ శాఖ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ కూట‌మి త‌ర‌ఫున‌ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. బీజేపీ అధిష్టానం తిర‌స్క‌రించింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే బీజేపీ పెద్ద‌ల నుంచి అందిన ఆదేశాల‌తో రాష్ట్ర బీజేపీ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప‌ట్టించుకోవ‌డం మానేసింద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు టీడీపీ కూడా తాము ఒంట‌రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని.. 160 సీట్లు సులువుగా గెల్చుకుంటామ‌ని చెబుతోంద‌ని గుర్తు చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సందిగ్దావ‌స్థ‌లో ఉన్నార‌ని పేర్కొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే బీజేపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ గుడ్ బై చెప్తార‌ని తెలుస్తోంది. బీజేపీ త‌న‌తో పొత్తు లేద‌ని ప్ర‌క‌టించ‌డానికి ముందే తానే ముందు ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు బీజేపీ వైఎస్సార్సీపీకి ద‌గ్గ‌ర‌వుతోంద‌ని అంటున్నారు.

వైఎస్సార్సీపీతో క‌లిసి పోటీ చేస్తే క‌నీసం ప‌ది సీట్ల‌లో అయినా గెల‌వ‌వ‌చ్చ‌ని.. ఆ త‌ర్వాత వైఎస్సార్సీపీ విజ‌యం సాధిస్తే ప్ర‌భుత్వంలోనూ చేరే అవ‌కాశం ఉంటుంద‌నేది బీజేపీ ఆలోచ‌న‌గా ఉంద‌ని పేర్కొంటున్నారు. జ‌న‌సేన‌తో పొత్తు కంటే వైఎస్సార్సీపీతో పొత్తే త‌మ‌కు లాభిస్తుంద‌ని బీజేపీ ఆలోచ‌న‌గా ఉంద‌ని అంటున్నారు. బీజేపీ రిపోర్ట్ ప్ర‌కారం.. జ‌న‌సేన కంటే వైఎస్సార్సీపీ బెట‌ర‌ని తేలింద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News