శివసేనలోకి నటి ఊర్మిళ..!

Update: 2019-09-17 08:26 GMT
రాజకీయాల్లో కండువాలు మార్చేయడం తనకు కూడా వచ్చు అని నటి ఊర్మిళ మటోండ్కర్‌ రుజువు చేసేలా కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ని వీడిన ఆమె శివసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్ర శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే పీఏ మిలింద్‌ నవ్రేకర్‌ తో భేటీ కావడంతో ఊర్మిళ శివసేనలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని ఊర్మిళ ఖండించారు. తాను శివసేనలోకి వెళ్ళడం లేదని - కేవలం మర్యాదపూర్వకంగానే మిలింద్‌ నవ్రేకర్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. పైకి ఎంత ఖండించిన ఆమె శివసేనలోకి వెళ్ళడం ఖాయమని తెలుస్తోంది.

మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా నేత‌లు ఈ రోజు అధికార పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం... తాము పార్టీ మార‌డం లేదు.. మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశామ‌ని చెపుతూనే మ‌రుస‌టి రోజే కండువాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు ఊర్మిళ కూడా అదే బాట‌లో ఉన్న‌ట్టు ముంబై రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ...ఆ ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఓటమి పాలైన దగ్గర నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఊర్మిళ ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు. ఇక పార్టీ వీడే క్రమంలో ఆమె కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా చేసింది. పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. స్వార్థం కోసం కొందరిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె శివసేనలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో జ‌రిగే మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె శివ‌సేన నుంచి అసెంబ్లీ బ‌రిలో ఉంటార‌ని టాక్‌..?
Tags:    

Similar News