కేసీఆర్ ఫార్ములానే పాలో అవుతున్న బాబు

Update: 2016-02-13 04:51 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌ ను ఏపీ సీఎం - టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో "త‌మ్ముడు కేసీఆర్" అనుస‌రించిన వ్యూహాన్నే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న 'అన్న చంద్ర‌బాబు' అమ‌ల్లో పెట్ట‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన స‌మ‌యంలో కేసీఆర్ అనేక ఒప్పందాలు, నిర్ణ‌యాల‌న్నింటినీ హైద‌రాబాద్ అభివృద్ధి కేంద్రంగా తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్నందున హైద‌రాబాద్ అభివృద్ధి కోసం ప‌లు ప్ర‌ణాళిక‌లు కూడా ర‌చించారు. క‌ట్ చేస్తే గ్రేట‌ర్ ఎన్నిక‌లు రావ‌డం, టీఆర్ ఎస్ రికార్డు స్థాయి మెజార్టీతో గెల‌వ‌డం తెలిసిందే. ఇపుడు సేమ్ ఫార్ములాను త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ గ్రేట‌ర్ విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్నాడ‌ని చెప్తున్నారు.

విశాఖ‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఫ్లీట్ రివ్యూతో మైలేజ్ పొందిన బాబు ఇపుడు సొంతంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ కీల‌క అడుగు వేశారు. విశాఖ స్మార్ట్‌ సిటీకి సంబంధించి యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ - ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... అమెరికా టెక్నాలజీకి పెట్టింది పేరని వారు తమ పరిజ్ఞానాన్ని అందిస్తే తమ యంత్రాంగంతో విశాఖ‌ను అభివృద్ధిని ప‌థంలో న‌డిపిస్తామన్నారు. దేశంలో తొలి విడతగా ఎంపిక చేసిన 20 నగరాల్లోనూ విశాఖ తొలిస్థానంలో నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు.  ఏపీలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలు ఉన్నాయని త్వరలోనే రెండు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ -చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో పాటు బెంగుళూరు-చెన్నై కారిడార్‌ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం జపాన్‌ - ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) సహకారం అందించనున్నట్లు బాబు వివరించారు.

విశాఖ గత ఏడాది అక్టోబర్‌ 12న సంభవించిన హుదుద్‌ తుపాన్‌ తో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికి ఏడాదిలోనే తిరిగి భాగస్వామ్య సదస్సు - ఐఎఫ్‌ ఆర్‌ తో పాటు అనేక అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయికి చేరుకుందన్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికి అభినందిస్తున్నట్లు బాబు తెలిపారు. విశాఖ అందమైన నగరమని, ఇక్కడ ప్రజలు సానుకూల దృక్పథం కలవారని, ఈ నగరాన్ని తాను ఎంతగానో అభిమానిస్తాన‌ని విశాఖవాసుల‌ను చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

చంద్రబాబు మాట‌లు, చ‌ర్య‌లు చూస్తుంటే సేమ్ టు సేమ్ కేసీఆర్ పొగ‌డ్త‌ల వ‌లే అనిపించ‌డం లేదు?! గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో తమ్ముడు కేసీఆర్ వేసిన ఎత్తుగ‌డ‌నే అన్న చంద్ర‌బాబు గ్రేట‌ర్ విశాఖ‌లో వేసేట‌ట్టున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.
Tags:    

Similar News