వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం..అమెరికా అలా చేయబోతుందా?

Update: 2020-05-24 05:10 GMT
మాయదారి రోగం దెబ్బకు యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఊహించని రీతిలో ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రపంచానికే పెద్దన్నలా ఉన్న అమెరికా అణ్వస్త్ర సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియంది ఏముంది? అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ద సమయంలో తమకు శత్రువుగా ఉన్న జపాన్ సంగతి చూసేందుకు రెండు అణు బాంబుల్ని విడవటం ద్వారా.. తన సత్తాను చాటటమే కాదు..యావత్ ప్రపంచం షాక్ తినేలా చేసింది.

ఆ తర్వాతి రోజుల్లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినా.. ఆ సమాచారాన్ని ప్రభుత్వాలు గుట్టుగా ఉంచటం.. తమకు అనుకూల సమయాల్లో వెల్లడించటం లాంటివి చేశాయి. ఇదిలా ఉంటే.. ప్రముఖ అమెరికా మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు తాజాగా ఒక షాకింగ్ కథనాన్ని అచ్చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించటానికి వీలుగా ప్రయత్నాల్ని ప్రారంభించినట్లుగా పేర్కొంది.

తనకు అదే పనిగా చిరాకు తెప్పిస్తున్న చైనా.. రష్యాలకు గట్టి హెచ్చరికలుజారీ చేయటమే దీని లక్ష్యమని చెబుతున్నారు. తుది నిర్ణయం తీసుకోలేదు కానీ.. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించాలన్న యోచనలో ట్రంప్ సర్కారు ఉందన్నట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు.

ఒకవేళ అమెరికా కానీ ఈ పరీక్షను నిర్వహిస్తే.. ఆ దేశానికి జరిగే ప్రయోజనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. అణ్వాయుధ పోటీని నివారించే ఉద్యమానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు సరిపోవన్నట్లు.. అణ్వస్త్ర పరీక్షకు ట్రంప్ సర్కారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. అంతర్జాతీయంగా మరిన్ని పరిణామాలకు తెర తీసినట్లే అవుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News