హ‌మ్మ‌య్య‌.. ఊపిరి పీల్చుకున్న అమెరికా!

Update: 2019-01-26 05:37 GMT
అగ్ర రాజ్యం అమెరికాలో త‌లెత్తిన సంక్షోభానికి తాత్కాలికంగా తెర‌ప‌డింది. ప్ర‌భుత్వ ష‌ట్ డౌన్ కార‌ణంగా దేశానికి ఆర్థికంగా - రాజ‌కీయంగా అన్ని విధాలా న‌ష్టం జ‌రుగుతుండ‌టంతో దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త దిగి వ‌చ్చారు. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను తాత్కాలికంగా పునఃప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అమెరికాలోకి అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను నివారించేందుకుగాను మెక్సికోతో స‌రిహ‌ద్దుల్లో భారీ గోడ నిర్మిస్తాన‌ని ట్రంప్ అధ్యక్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గోడ నిర్మాణానికి 5.7 బిలియ‌న్ డాల‌ర్లు కేటాయించాల‌ని బ‌లంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే - అమెరికా చ‌ట్ట స‌భ - కాంగ్రెస్ లో మెజారిటీ స‌భ్యులుగా ఉన్న డెమోక్రాట్లు నిధులు ఇచ్చేందుకు స‌సేమిరా అంటున్నారు.

గ‌తేడాది డిసెంబ‌రులో స‌రిహ‌ద్దు గోడ నిర్మాణానికి డ‌బ్బులు కేటాయించ‌కుండానే సెనేట్ బ‌డ్జెట్ ను రూపొందించింది. దానికి ఆమోదం తెలిపేందుకు ట్రంప్ నిరాక‌రించారు. వ్య‌య బిల్లును కూడా పెండింగ్ లో పెట్టారు. దీంతో ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు నిధులు నిలిచిపోయాయి. ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వేత‌నాలు నిలిచిపోయాయి. ప్ర‌భుత్వం పాక్షికంగా మూత‌ప‌డింది. అమెరికా చ‌రిత్ర‌లోనే అత్యంత సుదీర్ఘంగా ఈ ష‌ట్ డౌన్ శుక్ర‌వారంతో 35 రోజుల‌కు చేరుకుంది.

ష‌ట్ డౌన్ కు తెరదించేందుకు ట్రంప్‌ - డెమోక్రాట్లు - రిప‌బ్లిక‌న్ల మ‌ధ్య ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయి. గురువారం వ‌ర‌కు ఎవ‌రూ ప‌ట్టు వీడ‌లేదు. గోడ నిర్మాణ నిధుల‌తో కూడిన రెండు బిల్లుల‌ను రిప‌బ్లిక‌న్లు గురువారం సెనేట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. డెమోక్రాట్లు వాటికి ఆమోదం తెల‌ప‌లేదు. అయితే - శుక్ర‌వారం ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. గోడ నిర్మాణ ప్ర‌తిపాద‌న‌పై అధికార‌ - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ష‌ట్ డౌన్ ను తాత్కాలికంగా ఎత్తివేశారు. వచ్చే నెల 15 వరకు ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాలు మామూలుగా కొన‌సాగుతాయని ట్రంప్ ప్ర‌క‌టించారు. ట్రంప్ త‌న డిమాండ్ పై కాస్త వెన‌క్కి త‌గ్గ‌డమే తాజా ప‌రిణామానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎట్ట‌కేల‌కు అమెరికా ఊపిరి పీల్చుకుంటోంద‌ని.. వేత‌నాలు అంద‌క‌ విల‌విల్లాడుతున్న ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు ఇది వ‌ర‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News