ఇండియ‌న్స్‌ పై ట్రంప్ కొర‌డా..వీసా ఫీజు పెంపు

Update: 2017-08-14 10:46 GMT
భార‌తీయుల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కొర‌డా ఝ‌ళిపించారు. వీసా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించ‌డంతోపాటు ఫీజుల‌ను భారీ స్థాయిలో మోత మోగించారు. అదేమంటే.. భార‌తీయులు వీసాను దుర్వినియోగం చేస్తున్నార‌ని ఎదురు దాడికి దిగుతున్నారు. విష‌యంలోకి వెళ్తే..  అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత హెచ్ 1 బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రధానంగా ఇండియన్ టెక్ కంపెనీలకు ఇబ్బందిగా మారింది. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకొంది.

ముఖ్యంగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త విధానాల కారణంగా ఇండియన్ టెక్ కంపెనీలు కూడా అమెరికాలో ఉంటున్నవారికే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు  ముందుకు రావాల్సి ఉంటుంది. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం మినహ ఇతర టెక్ కంపెనీలకు ప్రత్యామ్నాయాలు కన్పించడం లేదు. మ‌రోప‌క్క‌, ఇమ్మిగ్రేషన్ విధానాలపై అమెరికాలో ఇటీవల జరిగిన సమీక్షలో భారతీయ టెక్ కంపెనీలు - టెక్కీలను టార్గెట్ చేశారు.

భారత అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్దంగా అక్రమ వలస పద్దతులను అనుసరిస్తున్నాయని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు, టెకీలు ఆత్మరక్షణలో పడ్డారు. హెచ్1 బీ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే ఉద్యోగులకు ఏ మేరకు చెల్లిస్తున్నారు, వేతన వ్యత్యాసాలపై కొందరు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు - టెకీలే లక్ష్యంగా నిర్ణ‌యాలు వెలువ‌డ్డాయి.  అంటే.. రాబోయే రోజుల్లో భార‌త్ నుంచి ఉద్యోగుల‌ను త‌గ్గించే ల‌క్ష్యంతోనే వీసా నిబంధ‌న‌లను మ‌రింత క‌ఠినం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

దీనికిగాను అవ‌స‌మైన‌న్ని లొసుగులు వెదికి.. భార‌తీయులకు అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వ‌కుండా చేయాల‌ని ట్రంప్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో హెచ్ 1 బీ వీసాలు ధరఖాస్తు చేసుకొంటున్న వారిలో చాలా మందికి అవసరమైన నైపుణ్యాలు లేవని హెచ్ 1 బీ  - ఎల్ 1 వర్కర్లను ఇంటర్వ్యూ చేసే అధికారి ఒకరు ఈ సమావేశంలోనే ప్రకటించడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.  మ‌రి రాబోయే రోజుల్లో భార‌త్‌కు ఇంకెన్ని అడ్డంకులు ఏర్ప‌డ‌తాయో చూడాలి.
Tags:    

Similar News