ఆసుపత్రిలో ఏడ్చిందని రూ.3వేలు బిల్లు వేశారట

Update: 2022-05-20 05:36 GMT
సాధారణంగా ఆసుపత్రికి వైద్యానికి వెళతాం. ఆ సందర్భంగా భావోద్వేగానికి గురవుతుంటాం. అయితే.. వైద్య సేవలకు బిల్లు వేయటం చూశాం కానీ.. అమెరికాలోని ఒక ఆసుపత్రిలో మాత్రం వైద్యుడి మాటలకు భావోద్వేగంతో ఏడుపు వచ్చేసి.

ఏడ్చేసినందుకు బిల్లు వేసిన వైనం వెలుగు చూసి విస్మయానికి గురి చేసింది. ఇలా కూడా బిల్లు వేస్తారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బిల్లు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకూ ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే.. అమెరికాకు చెందిన కామిల్లె జాన్సన్ తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. తన సోదరికి అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ కు చూపించే వేళలో.. ఆమెకు ఎదురైన జబ్బు గురించి వివరిస్తున్న టైంలో భావోద్వేగం ఆపుకోలేక ఏడ్చేసినట్లు పేర్కొన్నారు.

వైద్యుడ్ని కలిసి.. అక్కడ ట్రీట్ మెంట్ పూర్తి అయిన తర్వాత బిల్లు చెల్లించే వేళలో.. అందులో ఉన్న ఒక అంశం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య చికిత్సలో భాగంగా తాను ఏడ్చినందుకు 40 డాలర్లు.. అంటే మన రూపాయిల్లో 3వేలు ఛార్జి చేయటంతో అవాక్కు అయిన పరిస్థితి. బిల్లు చూసిన ఆమె షాక్ తిని.. తన అనుభవాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.

తన తండ్రికి బీమా ఉండటంతో ఇబ్బంది లేదు కానీ.. లేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. తనకు ఛార్జ్ చేసిన బిల్లును ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

అదిప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ఆసుపత్రుల్లో వైద్యానికి ఛార్జీలు వేస్తారు కానీ.. భావోద్వేగానికి గురై ఏడిస్తే కూడా భారీగా బిల్లు వేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదే విధానం మన దేశంలో ఉంటే.. రోగి వైద్యానికి మించి.. ఏడుపులకే భారీ బిల్లులు చెల్లించాల్సి వస్తుందేమో?
Tags:    

Similar News