అమెరికాయే కాదు ఇండియాకు కూడా షాకివ్వడం తెలుసు

Update: 2019-06-16 13:49 GMT
అగ్రరాజ్యంగా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చిన్నపాటి సహాయాలు చేయడం.. ఆయా దేశాలు ఏదైనా సందర్భాలలో తమకు అనుకూలంగా వ్యవహరించకపోవడమో.. తమకు నచ్చని పనిచేయడమో చేస్తే ఆ సహాయాలు నిలిపివేస్తామని హెచ్చరించడం.. బెదిరించడం.. ఆర్థికంగా నష్టం కలిగేలా ఇబ్బంది పెట్టడం అమెరికా విధానం. అప్పటికీ లొంగకపోతే యుద్ధానికి దిగి ఆ దేశాన్ని నాశనం చేయడం. ఆది నుంచీ ఇదే పద్ధతైనా ఇప్పుడు ట్రంప్ పాలనలో ఇది మరీ ఎక్కువవుతోంది. చిన్నచితకా దేశాలకే కాదు.. భారత్ - చైనా - రష్యా వంటి పెద్ద దేశాలనూ ఇబ్బంది పెట్టే ఆటలాడుతోంది అమెరికా. ఇప్పటికే చైనాతో ట్రేడ్ వార్ కొనసాగిస్తున్న అమెరికా కొద్దికాలంగా భారత్‌ తోనూ అదే తీరున వ్యవహరిస్తోంది. భారత్ నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులకు డ్యూటీ ఫ్రీ ప్రయోజనాలను గత ఏడాది ఉపసంహరించుకుంది.

దీంతో భారత్ కూడా అంతే ఘాటుగా స్పందించింది.  అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించాలని నిర్ణయించింది. వీటిలో ఆల్మండ్ - యాపిల్ - వాల్‌ నట్ తదితరాలు ఉన్నాయి. అల్యూమినియం - స్టీల్ తదితర వాటిపై కొత్త టారిఫ్‌ లను ఎత్తివేసేందుకు అమెరికా తిరస్కరించడంతో గతేడాది జూన్‌ లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 120 శాతం వరకు విధించాలని నిర్ణయించింది.

అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన చర్చలు జరగడంతో ఈ నిర్ణయం అమలు వాయిదా పడుతూ వస్తోంది. 2018 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ 152.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, అమెరికా నుంచి ఆల్మండ్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న తొలి దేశంగా - యాపిల్స్‌ ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రెండో దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కాగా, భారత్ తాజా నిర్ణయంతో వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి.
Tags:    

Similar News