వైఎస్ ప‌థ‌కాన్ని న‌మ్ముకున్న తెలంగాణ కాంగ్రెస్‌

Update: 2018-08-22 04:39 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయం అంత‌కంత‌కూ ర‌స‌దాయ‌కంలో ప‌డుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్ని షెడ్యూల్ కంటే ముందే.. ఈ ఏడాది చివ‌రి నాటికి నిర్వ‌హించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉండ‌టంతో రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

ఆయ‌న చెప్పిన మాట‌లు చూస్తుంటే.. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అమ‌లు చేసిన ప‌థ‌కాన్ని న‌మ్ముకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆ ప‌థ‌క‌మే త‌మ‌ను మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పాలి. తాము కానీ  ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రికి అస‌రా ఫించ‌న్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఒకే ఇంట్లో అర్హులైన భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు ఉంటే వారికి అస‌రా ఫించ‌న్లు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రో ఒక‌రికి మాత్ర‌మే ఫించ‌న్ ఇస్తున్నారు. దీంతో.. డ‌బ్బులు వ‌చ్చే వారిని బాగా చూడ‌టం.. రెండో వారిని ప‌ట్టించుకోక‌పోవ‌టం జ‌రుగుతోంది. తాజా హామీ అమ‌లైతే.. వృద్ధుల‌కు మ‌రింత భ‌రోసా ల‌భించ‌టం ఖాయం.

ఒకే ఇంట్లో ఇద్ద‌రు వృద్ధులు ఉన్నా ఫించ‌న్లు ఇస్తామ‌ని చెప్పిన ఉత్త‌మ్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగుల త‌ల్లిదండ్రుల‌కు కూడా ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక్క‌డితో వ‌రాలు అయిపోలేదు.. ఇప్ప‌టివ‌ర‌కూ 65 ఏళ్లుగా ఉన్న ఫించ‌న్ల అర్హ‌త‌ను 58 ఏళ్ల‌కు త‌గ్గించ‌నున్న‌ట్లుగా చెప్పారు. ఈ హామీపై భారీగా ప్ర‌చారం సాగితే.. రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్ చేతికి ఇదో ఆయుధంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వైఎస్ హ‌యాంలో భారీ మైలేజీ తెచ్చిన ప‌థ‌కాల్ని మ‌ళ్లీ తెర మీద‌కు తీసుకురావ‌టం క‌నిపిస్తుంది. అందుకు నిద‌ర్శ‌నంగా ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కాన్ని ఉత్త‌మ్ ప్ర‌స్తావించ‌టం. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించ‌టంలో పాటు.. పాత బ‌కాయిల్ని విడుద‌ల చేస్తామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని కార్య‌క‌ర్త‌లు గ్రామాల్లో విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని చెబుతున్నారు. పార్టీ బ‌లోపేతానికి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు త‌గిన గుర్తింపునిస్తామ‌ని ఉత్త‌మ్ వెల్ల‌డించారు. వారి అభిప్రాయాల‌కు త‌గ్గ‌ట్లే ఎంపీ.. ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే.. విపక్షంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ తాను మ‌ళ్లీ అధికారంలోకి రావ‌టానికి వైఎస్ ను న‌మ్ముకోవ‌టం మిన‌హా మ‌రో గ‌త్యంత‌రం లేన‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News