గ‌డ్డం శ‌ప‌ధానికి తోడు స‌న్యాసం మాటేంది ఉత్త‌మ్‌!

Update: 2018-04-07 13:37 GMT
ఇవాల్టి రోజున రాజ‌కీయాల్లో నాజూకు చ‌ర్మం ఉండేవారు త‌క్కువ మందిగా చెబుతారు. నేత అన్న వెంట‌నే.. చ‌ర్మం మొద్దుబారిపోవ‌టం.. నాలుక మ‌డ‌త‌ప‌డిపోవ‌టం కామ‌న్ అయిపోయింది. ఇవాళ చెప్పిన మాట రేప‌టికి రెండు అన్న‌ట్లుగా ఉండ‌ట‌మే కానీ.. మాట మీద నిల‌బ‌డే నేత‌లు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తారు. ఎవ‌రిదాకానో ఎందుకు?  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తే తీసుకోండి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ‌కు మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే అవుతాడంటూ చాలానే మాట‌లు చెప్పారు. ఆ త‌ర్వాత ఏమైందో అంద‌రికి తెలిసిందే.

అది కూడా వ‌దిలేయండి. టీఆర్ ఎస్ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చాక‌.. కేసీఆర్ భారీ స‌వాల్‌ ను విసిరారు. 2018 ఎన్నిక‌ల‌కు ముందే.. తెలంగాణ‌లోని ప్ర‌తి ఇంటికి న‌ల్లా నీరు తెప్పిస్తాన‌ని.. ఒక‌వేళ ఆ ప‌ని చేయ‌లేక‌పోతే ఎన్నిక‌ల వేళ ఓట్లు అడ‌గ‌మ‌ని చెప్పేశారు. మూడు.. నాలుగు నెల‌ల పాటు ఇదే మాట‌ను.. మార్చి మార్చి చెప్పిన కేసీఆర్.. ఇప్పుడా మాట‌ను క‌నీసం గుర్తు పెట్టుకున్నారా? అంటే అనుమాన‌మే.

ఒక‌వేళ గుర్తు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. గ‌య్యిమ‌న‌ట‌మే కాదు.. తెలంగాణ బాగుండ‌టం ఇష్టం లేదా?  లాంటి పెద్ద మాట‌ను చ‌టుక్కున అనేసి.. మ‌ళ్లీ నోరు తెర‌వ‌కుండా చేస్తారు. ఇలా మాట మీద నిల‌బ‌డ‌ని వాళ్ల‌ల్లో కేసీఆర్ ఒక్క‌రే ఉన్నారా? అంటే.. చాలామందే ఉన్నారు. కాకుంటే.. కేసీఆర్ ఎగ్జాంఫుల్స్ అయితే ఇట్టే గుర్తుకు వ‌స్తాయ‌ని చెప్ప‌ట‌మే కానీ.. పెద్ద మ‌నిషిని కించ‌ప‌రిచే ఉద్దేశం ఎంత మాత్రం లేదు సుమా.

ఇలాంటి వారికి కాస్త భిన్న‌మైన వ్య‌క్తిగా తెలంగాణ పీసీసీ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిని చెప్పొచ్చు. ఆయ‌నేం సుద్ద‌పూస కాదు కానీ.. ఆవేశంతో కానీ ఆగ్ర‌హంతో కానీ ఏదైనా మాట అంటే దాని మీద నిల‌బ‌డే వ్య‌క్తి. మాట అన్న త‌ర్వాత ఏది ఏమైనా వెన‌క్కి మ‌ళ్లే తీరు ఆయ‌న‌లో క‌నిపించ‌దు. ఏదో ఆవేశంతో ఆ మ‌ధ్య‌న మ‌ళ్లీ ప‌వ‌ర్ వ‌స్తేనే గ‌డ్డం గీసుకునేది అన్న మాటకు క‌ట్టుబ‌డి ఏళ్లు గ‌డుస్తున్నా గ‌డ్డం తీయ‌ని పెద్ద‌మ‌నిషి.

గ‌డ్డం పేరుతో తెలంగాణ అధికార‌ప‌క్ష నేతలు జోకులు వేసుకున్నా లెక్క చేయ‌కుండా.. త‌న మాటే మాట అన్న‌ట్లుగా ఉన్నారే త‌ప్పించి గ‌డ్డం తీయ‌లేదు. ఇలాంటి పెద్ద మ‌నిషి తాజాగా మ‌రో భారీ శ‌ప‌ధం చేసేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ప‌వ‌ర్లోకి రాకుంటే రాజ‌కీయాల నుంచి శాశ్వితంగా త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌కు స‌వాల్ విసిరిన మంత్రి కేటీఆర్ కు.. తాను స‌వాల్ స్వీక‌రిస్తున్నాన‌ని.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌టానికి కేటీఆర్ సిద్ధ‌మేనా? అని స‌వాలు విసిరారు.

ఉత్త‌మ్ స‌వాలుకు కేటీఆర్ రియాక్ట్ అవుతారో లేదో కానీ.. ఉత్త‌మ్ మాత్రం క‌ట్టుబ‌డి ఉండ‌టం ఖాయ‌మంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ఎడ్జ్ లో ఉన్న విష‌యం ఒప్పుకోవాల్సిందే. అలాంటి వేళ‌.. ఉత్త‌మ్ తొంద‌ర‌ప‌డి శ‌ప‌ధం చేసేశార‌న్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే గ‌డ్డం విష‌యంలో అన్న మాట మీద నిల‌బ‌డిన ఉత్త‌మ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయాల్లో క‌నిపించ‌కుండా పోతారా ఏంది? అన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఉత్త‌మ్ మీద అభిమానం ఎక్కువ‌గా ఉన్నోళ్లు ఒక త‌రుణోపాయం చెబుతున్నారు. ఉత్త‌మ్ స‌వాల్ మాత్ర‌మే విసిరార‌ని.. కేటీఆర్ కానీ స్పందించ‌కుండా ఉంటే చ‌ప్పుడు చేయ‌కుండా ఉంటే.. జ‌నం మ‌ర్చిపోతార‌న్న మాట‌ను చెబుతున్నారు. ఇలాంటి వాటికి ఉత్త‌మ్ దూర‌మ‌న్న‌ది తెలిసిందే. గ‌డ్డం శ‌ప‌ధాన్ని ప‌క్క‌న పెడితే.. శాశ్వితంగా రాజ‌కీయ స‌న్యాసం విష‌యంలో ఉత్త‌మ్ తొంద‌ర‌ప‌డ్డార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News