కేసీఆర్ వంద‌ సీట్ల స‌ర్వే..ప‌క్క‌ రాష్ట్రంలో చేసింద‌ట‌

Update: 2018-08-25 17:50 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీరుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. గాంధీ భవన్ లో జ‌రిగిన చిట్‌ చాట్‌ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి టీఆర్ ఎస్‌ ది ప్రగతి నివేదిన సభ కాదు ..ప్రగతి లేని నివేదన సభ,  టీఆర్ ఎస్‌ నేతల దోపిడీ నివేదన సభ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాలుగున్నర ఏళ్లలో ఏం సాధించారని ఈ స‌భ నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర మ్యానిఫెస్టోతో పాటు ఈసారి నియోజకవర్గానికి ఓ మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. లోకల్ ఇష్యుస్ కు మరింత పరిష్కారం కోసమే నియోజకవర్గానికి మ్యానిఫెస్టో అని ఆయ‌న వివ‌రించారు. దీంతోపాటుగా కేసీఆర్ సీట్ల ధీమాపై ఆయ‌న సెటైర్ వేశారు.

ఏడు గంటల కేసీఆర్ కేబినెట్ మీటింగ్ వివరాలను బ్రీఫింగ్ ఇవ్వకపోవడం ఆశ్యర్యం కల్గిస్తోంద‌ని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ప్ర‌శ్నించే వాతావ‌ర‌ణ‌మే లేద‌ని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించకపోతే మీడియాకు కూడా భవిష్యత్ లో మరింత ఇబ్బంది అవుతుంద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికలకు తాము పూర్తి సమాయత్తంగా ఉన్నామ‌ని - ఆశావాహ అభ్యర్థులు ఎంత మంది ఉంటే వారందరి పేర్లు సర్వే కోసం పంపిస్తామ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ముందస్తుకు ఓకే అనీవుంటే ..కేసీఆర్ మళ్ళి మోడీని ఎందుకు కలిసినట్లు అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు.వంద సీట్లు గెలుస్తామంటూ కేసీఆర్ మజాక్ చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసే సర్వేలు ..వేరో రాష్ట్రంలో చేసినవి అనుకుంటా అని ఆయ‌న భారీ సెటైర్ వేశారు. ``కేసీఆర్ స‌ర్వేలు ప‌క్క‌రాష్ట్రంలో కావ‌చ్చు...కానీ మా సర్వేలు తెలంగాణలో చేశాం. మేము 75 సీట్లు గెలవడం ఖాయం. ఎన్నికలు డిసెంబర్‌ లో వచ్చినా ..ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే. ఇది ఖాయం`` అని ఉత్త‌మ్ విశ్వాసం వ్య‌క్తం చేశారు.

టీచర్ల‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పట్ల ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. సుమారు నాలుగు లక్షల ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, నాలుగేళ్లుగా ఒక్కసారి ఉపాధ్యాయులకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. ఉద్యోగులకు జూన్ రెండున ఐఆర్ ఇస్తానని సీఎం చెప్పిన మాట ఎటుపోయిందని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. ఆర్టీసీ కార్మికులకు కి పదహారు శాతం కాకుండా 25శాతం ఐఆర్ ఇవ్వాలని, ఉద్యోగుల ఖర్మ కాండలకు 11 రోజుల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.



Tags:    

Similar News