రాజీవ్ శ‌ర్మ బ్రోక‌రా?..ఉత్త‌మ్ షాకింగ్ వ్యాఖ్య‌లు

Update: 2018-09-12 10:23 GMT
కేసీఆర్ అన్నంత‌నే.. త‌న మాట‌ల‌తో ఎదుటి వారిని స‌మ్మోహ‌నం చేసే గుణం చ‌ప్పున స్పుర‌ణ‌కు వ‌స్తుంది. అలాంటి కేసీఆర్ తాను చేసిన వ్యాఖ్య‌తో ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన ప‌రిస్థితి నెల‌కొంది. ముందస్తుకు వెళ్లే క్ర‌మంలో ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ కు లేఖ ఇచ్చిన అనంత‌రం ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్‌.. ఊహించ‌ని రీతిలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మీడియాను ఎత్తిపొడిచేలా మాట్లాడే క్ర‌మంలో ఆయ‌న అనుకోకుండా మాట జారారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల‌తో తాను మాట్లాడిన విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌టంతో పాటు.. ఎన్నిక‌ల షెడ్యూల్ ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్పారు. ఆత్మవిశ్వాసం హ‌ద్దులు దాటిన వేళ‌.. ఈ త‌ర‌హాలోనే మాట‌లు ఉంటాయ‌న్న దానికి నిద‌ర్శ‌నంగా ఈ విష‌యాన్ని చెప్పొచ్చు.

కేసీఆర్ చేసిన త‌ప్పును.. ఆయ‌న మాట‌ల మీద విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. కేసీఆర్ నోట వెంట వ‌చ్చిన మాట పుణ్య‌మా అని ఈసీ సైతం ఇప్పుడు ఇబ్బందుల‌కు గురి అవుతున్న ప‌రిస్థితి. తాజాగా విప‌క్షాల‌న్నీ క‌లిసి కేసీఆర్ మీద తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతూ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ నుక‌లిసిన సంద‌ర్భంలో ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ను కొన‌సాగించొద్దంటూ కాంగ్రెస్‌.. సీపీఐ.. టీజేఎస్.. టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అంతేనా.. రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఓవైపు కేసీఆర్ తీరును త‌ప్పు ప‌డుతున్న విప‌క్షాలు.. మ‌రోవైపు ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా తీవ్రంగా విరుచుకుప‌డుతున్నాయి.  ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లు ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌జ‌ల హ‌క్కుల్ని కాల‌రాసేలా నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లుగా మండిప‌డ్డారు.

ఎన్నిక‌లు ఎప్పుడు జ‌ర‌గాలో కూడా కేసీఆర్ ముందే చెప్పేయ‌టంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కేసీఆర్ త‌న ఎన్నిక‌ల షెడ్యూల్ ను  ప్ర‌క‌టించార‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దాన్ని పాటించ‌కూడ‌దంటూ ఎన్నిక‌ల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాజీవ్ శ‌ర్మ ఎన్నిక‌ల సంఘంతో మాట్లాడ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

టీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున శ‌ర్మ ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఎలా క‌లుస్తారు?  ఆయ‌నేమైనా బ్రోక‌రా? అంటూ తీవ్ర‌ప‌ద‌జాలంతో మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని గ్ర‌హించి ఏకం కావాల‌ని పిలుపును ఇవ్వ‌ట‌మే కాదు.. జ‌గ్గారెడ్డిని అక్ర‌మంగా అరెస్ట్ చేసిన‌ట్లుగా త‌ప్పు ప‌డుతున్నారు తెలంగాణ‌ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్‌.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతుంద‌ని ఫైర్ అయ్యారు టీజేఎస్ అధినేత కోదండం మాష్టారు.  రాజ్యాంగ సంస్థ‌ల్ని త‌న గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఫైర్ అయ్యారు. వీరితో పాటు వామ‌ప‌క్ష నేత‌లు సైతం కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. చూస్తుంటే.. కేసీఆర్ తాను అనుకున్న‌ది చేయ‌టం కోసం ఎంత‌మంది పైనైనా కేసులు పెట్ట‌టానికి వెనుకాడ‌ర‌న్న చాడా వెంక‌ట్ రెడ్డి మాట‌కు త‌గ్గ‌ట్లే ఈ రోజు మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై హౌసింగ్ సొసైటీలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌న్న ఫిర్యాదు న‌మోదు కావ‌టం లాంటివి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు ప‌లువురు త‌మ‌కు ఇబ్బందిగా మారిన వారిపైనా ఏదోలా కేసులు పెడుతున్నార‌న్న అభిప్రాయం క‌లిగేలా ప‌రిణామాలపై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి.


Tags:    

Similar News