ఉత్తమ్.. కుర్చీ వదిలేది లేదట..!?

Update: 2019-06-29 08:54 GMT
2019 సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. రెండోసారి మోడీ ఘనంగా అధికారంలోకి వచ్చాడు. అయితే అంతకుముందే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ ఫలితాలు ఊహించనవి. స్వయంగా అమేథీలో రాహుల్ కూడా ఓడిపోవడం చూసి ఆయన షాక్ అయ్యారు. ఇక తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టనని భీష్మించుకు కూర్చున్నారు.

అయితే రాహుల్ ఆవేదనలో అర్థముంది. మొన్ననే గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లోనూ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవలేదు. రాజస్థాన్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ కొలువైన సీనియర్ కాంగ్రెస్ సీఎంల వల్లే ఓటమి ఎదురైందని.. వారి స్వార్థరాజకీయ విధానాలకు పార్టీ బలైపోతుందని రాహుల్ అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొట్టారు. వారు వైదొలిగితేనే తాను కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతానని స్పష్టం చేశారు.కానీ సోనియా, కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ మాటను పెడచెవిన పెట్టారు. అందుకే ఇప్పుడు రాహుల్ దూరంగా ఉంటున్నారు..

అయితే తాజాగా దేశంలోని కాంగ్రెస్ బాధ్యులు, కీలక స్థానాల్లో ఉన్న నేతలంతా రాజీనామాల బాటపట్టారు. 145 మంది వరకు పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు రిజైన్ చేశారు.  ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయగా.. ఈరోజు ఆశ్చర్యకరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

అయితే అందరూ చేస్తున్నా తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పదవిని వీడేందుకు సాహసించకపోవడం విశేషం. ఆయన ఎంత మంది రాజీనామా చేసినా కుర్చీని వదలకపోవడం కాంగ్రెస్ ను షాక్ కు గురిచేస్తోంది. రాహుల్ గాంధీ కోరిక మేరకు పార్టీ ప్రక్షాళనలో అందరూ రాజీనామాలకు సిద్ధపడ్డా ఉత్తమ్ మాత్రం కుర్చీ వదలకపోవడం చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News