ఉత్త‌మ్ ధైర్యంపై కాంగ్రెస్‌ లోనే డౌట్లు?

Update: 2018-01-12 08:32 GMT
ఔను - సాక్షాత్తు పార్టీ ర‌థ‌సారథి చేసిన ప్ర‌క‌ట‌నే విశ్వ‌స‌నీయంగా లేద‌ని ఆ పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. పార్టీలోని అనైక్య‌త‌ - వాస్త‌వ ప‌రిస్థితులు అర్థం చేసుకోకుండా వ్య‌వ‌హరించ‌డం చూస్తుంటే..భారీ ప్ర‌క‌ట‌న‌ల‌కే పార్టీ ముఖ్యులు ప‌రిమిత‌మ‌య్యారా అనే సందేహం క‌లుగుతోందని చెప్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీలో కాగా - అందుకు కార‌ణ‌మైంది ఆ పార్టీ ర‌థ‌సార‌థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అని అంటున్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - ఎఐసిసి ప్రధాన కార్యదర్శి - పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జీ ఆర్‌ సి కుంతియా వివిధ సభల్లో మాట్లాడుతూ టిఆర్‌ ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఉత్తమ్ ఒక అడుగు ముందుకేసి సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందు మంచి రోజులు కావని భావిస్తారు కాబట్టి, పండుగ తర్వాత భారీగా చేరికలు ఉంటాయని ఆయన చెప్పారు.

సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్‌ లో కొత్తగా చేరే నాయకులు ఎవరు?, ఏయే పార్టీలో నుంచి రానున్నారు?, అధికార పార్టీకి ‘చిల్లు’ కొట్టనుందా? అనే ఆసక్తికరమైన చర్చ, ఉత్కంఠ ఆరంభమైంది. అదే స‌మ‌యంలో ఉత్త‌మ్ కామెంట్ల‌పై విశ్లేష‌ణ కూడా మొద‌లైంది. నిజానికి కాంగ్రెస్‌లో చేరేదెవరూ? అని ఆలోచిస్తే అధికారంలో ఉన్న టీఆర్‌ ఎస్‌ ను వదిలి చేరేందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ ఎస్‌ లో చేరి, అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్న ఒకరిద్దరు నేతలు ఎవరైనా సాహసించి వెనక్కి వస్తారేమోనన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించి - టీఆర్‌ ఎస్‌ లో కలకలం సృష్టించేందుకే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేసి ఉంటారని మరి కొందరి భావన.

అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆ పార్టీ వ్య‌వ‌హారాల గురించి తెలిసిన వారి మాట‌.  కాంగ్రెస్ నేతల్లో అనైక్యత, అభద్రతాభావం కారణంగా కొంత మంది నాయకులు టీఆర్‌ ఎస్‌ లో చేరారని అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ ఎస్‌ లోకి ఫిరాయిస్తున్నా, పార్టీ నాయకత్వం అడ్డుకట్ట వేయలేక పోయిందంటున్నారు. టీఆర్‌ ఎస్‌ లోకి ఫలానా నాయకుడు ‘జంప్’ కానున్నట్లు మీడియా ద్వారా ముందుగానే వెల్లడైనా - వారిని ఆపడంలో జిల్లా, నాయకులు - రాష్ట్ర నాయకులు విఫలమయ్యారని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా వేరే పార్టీల నుంచి వచ్చే నాయకులు కూడా వెనుకాడుతున్నారని వారంటున్నారు.

వాస్త‌వంగా ఇలాంటి ప‌రిస్థితులు ఉంటే..పార్టీ ఫిరాయింపులు ఉంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డంతో ఫ‌లితం ఏముంటుందని టీఆర్ ఎస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌క‌ట‌న‌ల కంటే కార్యాచ‌ర‌ణ ముఖ్య‌మని చెప్తున్నారు. పార్టీ బ‌ల‌ప‌డుతుందంటే..ఊగిస‌లాట‌లో ఉన్న నేత‌లు ఎలాగైన హ‌స్తం గూటికి చేరుతార‌ని వారు న‌మ్మ‌కంగా విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News