కేటీఆర్ అందంగాడే...కానీ వ‌క్ర‌బుద్ధి

Update: 2018-04-26 05:43 GMT
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీపై విరుచుకుప‌డే కాంగ్రెస్ నేత‌ల్లో ముందుండే సీనియర్‌ నాయకుడు - మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఇటీవ‌ల త‌న దూకుడును పెంచిన సంగ‌తి తెలిసిందే. అవ‌కాశం దొర‌క‌డం ఆల‌స్యం అధికార పార్టీపై ఆయ‌న దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా మ‌రోమారు ఆయ‌న ఇదే ప‌ని చేశారు. అయితే ఈ ద‌ఫా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై కాకుండా ఆయ‌న కుమారుడిపై చిత్ర‌మైన కామెంట్లు చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో ఇసుక మాఫియా కార‌ణంగా ద‌ళితులు చ‌నిపోయార‌నే ఆరోప‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించింది. బాధితుల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి.

తాజాగా నేరెళ్ల‌ బాధితులను మాజీ ఎంపీ వీహ‌చ్ పరామర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, ఇప్పటి వరకు నేరెళ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోకపోవడమే అందుకు నిదర్శనమని అన్నారు. `మంత్రి కేటీఆర్‌ అందంగా ఉంటాడు. చక్కగా మాట్లాడుతారు. బుద్ధి మాత్రం వక్రంగా ఉంటుంది' అని వీహెచ్ వ్యాఖ్యానించారు. గతంలో మంత్రి కేటీఆర్‌ వీరిని పరామర్శించి ఆదుకుంటానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇసుకాసురుల ఆగడాలకు, వారి వాహనాల కింద ఎంత మంది బలవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వే బిల్లుపై మూడు ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని వివరించారు. బాధితులపై పెట్టిన కేసులను తొమ్మిది నెలలు గడుస్తున్నా.. తొలగించకుండా, కనీసం వారిని ఆదుకోకుండా ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. ఈనెల 27న చేపట్టబోయే ఆక్రోస్‌ యాత్రలో నేరెళ్ల బాధితుల గోడును రాహుల్‌ గాంధీ ఢిల్లీలో వినిపించనున్నారని తెలిపారు. గ్యాంగ్‌ స్ట‌ర్‌ నయీం కేసులో దోషులుగా ఉన్న అధికారులను తప్పించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని వీహెచ్ ఈ సంద‌ర్భంగా ఆరోపించారు.
Tags:    

Similar News