వీహెచ్ హీరోయిజం..ఓయూకు వెళ్లి మ‌రీ స్పీచ్‌!

Update: 2018-09-03 05:55 GMT
పాతిక ల‌క్ష‌ల మందితో  పెద్ద స‌భ పెడ‌తాన‌న్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌కు.. తెలంగాణ‌లోని ప‌లువురు పాతిక ల‌క్ష‌ల‌తో స‌భ కాదు నాయనా.. ఓయూకు వెళ్లి స‌భ పెట్టి మాట్లాడితే అదే గొప్ప అన్న మాటను చెబుతున్న ప‌రిస్థితి. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన ఓయూ విద్యార్థులు టీఆర్ ఎస్ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఉద్య‌మ వేళ త‌మ బ‌తుకుల్ని మారుస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ డిమాండ్ల‌ను పూర్తి చేయ‌క‌పోవ‌టంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికి తోడు త‌మ నిర‌స‌న‌ల‌కు చెక్ చెప్ప‌టం.. ఆందోళ‌న‌లు చేస్తే కేసులు పెట్టే తీరుపై వారు గుర్రుగా ఉన్నారు. ఈ కార‌ణంతోనే కేసీఆర్ ను ప‌లువురు ఓయూలో స‌భ పెట్టే ధైర్యం ఉందా? అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తుంటారు.

నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఒక్క కేసీఆర్ కు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ నాయ‌కులు ప‌లువురికి ఓయూకు వెళ్లాలంటే ద‌డే. ఓవైపు కేసీఆర్ ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సు నిర్వ‌హిస్తుంటే.. మ‌రోవైపు ఓయూ విద్యార్థులు ఆవేద‌న స‌భ‌ను నిర్వ‌హించారు. దీనికి వీసీతో పాటు.. పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. క్యాంప‌స్ లో విద్యార్థుల ఆందోళ‌న‌ల్ని నిర్వ‌హించేందుకు సైతం ఒప్పుకోలేదు.

ఇలాంటి వేళ‌.. ఊహించ‌ని విధంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు క్యాంప్ లోకి ప్ర‌వేశించి.. ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద‌కు త‌న కారులో వెళ్లారు. ఎలాంటి స‌మాచారం లేకుండా నేరుగా వీహెచ్ కారు రావ‌టంతో పోలీసుల‌కు షాకింగ్ గా మారింది. ఆయ‌న్ను పోలీసులు ఆపేశారు . అయితే.. త‌న‌కు ప‌ది నిమిషాల స‌మ‌యం ఇస్తే.. తాను విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోతాన‌ని చెప్పారు.

త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో పోలీసులు ఓకే అనాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఎలాంటి ఆహ్వానం లేకుండా త‌మ‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన వీహెచ్ ను చూసిన విద్యార్థులు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన వీహెచ్ ప‌ది నిమిషాల వ్య‌వ‌ధిలోనే తిరిగి వెళ్లిపోయారు. ఓయూకు వెళ్ల‌టానికి సంశ‌యించే ఇత‌ర నేత‌ల‌కు భిన్నంగా వీహెచ్ మాత్రం హీరోయిజం చూపించ‌టం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News