టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో దూకుడు పెంచేసిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అమరవీరుల స్పూర్తియాత్ర పేరుతో కోదండరాం చేపట్టిన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో...ప్రభుత్వం- కోదండరాం మధ్య సాగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారిపోయింది. తాను ముందుగా అనుమతి కోరితే...సరేనన్న ప్రభుత్వం ఆ తర్వాత నో చెప్పిందని కోదండరాం ఆరోపించారు. ఉద్యమాలను అణిచివేసే రీతిలో...ప్రజాస్వామ్య గొంతుకను నొక్కివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఐకాస చైర్మన్ కోదండరాం ఇటు ప్రభుత్వం అటు పార్టీపై అగ్గిమీద గుగ్గిలం అయిన నేపథ్యంలో టీఆర్ ఎస్ సీనియర్ నేత రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందిస్తూ.... అనుమతి ఇవ్వవద్దని తానే పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ సందర్భంగా కోదండరాంపై ఆయన సంచలన కామెంట్లు కూడా చేశారు. నక్సలైట్ల(మావోయిస్టులు)తో కోదండరాంకు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కామెంట్ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. రాష్ట్ర హోంమంత్రి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ - ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ ఘాటుగా స్పందించారు. కోదండరాం వెంట నక్సలైట్లు ఉన్నారని హోమ్ మంత్రి నాయిని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. సర్కార్ తీరు చూస్తుంటే .. కోదండరాంను ఎన్ కౌంటర్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నక్సలైట్ల పేరుతో కోదండరాంను ఎన్ కౌంటర్ చేసే ప్రమాదం ఉందని వీహెచ్ అనుమానం వ్యక్తం చేశారు. కోదండరాంకు కానీ ..జేఏసీ నేతలకు కానీ ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ఉద్యమంలో మంచిగా కలిపించిన కోదండరాం .. ఇప్పుడు చెడ్డోడుగా కనిపిస్తున్నాడా అని వీహెచ్ నిలదీశారు.పోలీస్ అమరుల త్యాగాలపై 5కే రన్ చేసిన గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ అమరుల కోసం కోదండరాం యాత్రకు వెళితే పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎందుకు కనిపించడం లేదని వీహెచ్ ప్రశ్నించారు. గవర్నర్ ఒక్కవైపే చూస్తున్నారు .. రెండువైపులా చూడటం లేదని ఆరోపించారు. గవర్నర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.