జూనియర్‌ ఎన్టీఆర్‌పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-02 07:44 GMT
ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ ఆ తర్వాత కొద్ది కాలానికే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా మరోమారు చంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో తాను విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయానని వంశీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 2014లో కొడాలి నాని సూచన మేరకు గన్నవరం అసెంబ్లీ టికెట్‌ కావాలని చంద్రబాబును అడిగానన్నారు. అయితే తనకు టికెట్‌ ఇవ్వడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఎప్పుడూ మాట్లాడకూడదని చంద్రబాబు తనతో ఒట్టు వేయించుకున్నారని వంశీ బాంబు పేల్చారు.

అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ 25 ఏళ్ల వయసులోనే చిరంజీవికి సమానంగా ఎదిగారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2009లో జూనియర్‌ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించారని.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు పత్రికల్లో కథనాలు రాయించారని వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2009 ఎన్నికల్లో ప్రచారం చేసి వెళ్తున్నప్పుడే జూనియర్‌ ఎన్టీఆర్‌కు కారు ప్రమాదం జరిగిందని వల్లభనేని వంశీమోహన్‌ గుర్తు చేశారు. తన స్వార్థం కోసమే చంద్రబాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ను టీడీపీ ప్రచారానికి వాడుకున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు వల్లభనేని వంశీ ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయనపై కొందరు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. ప్రతి విషయానికీ జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారని.. ఆయన ఎందుకు స్పందించాలని టీడీపీ నేతలను నిలదీశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కనీసం పట్టించుకోలేదని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్‌ను పట్టించుకోరు కానీ.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన కావాలా అని టీడీపీ నేతలను వల్లభనేని వంశీ నిలదీశారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. చంద్రబాబుకు తన స్వార్థం తప్ప మరేం అక్కర్లేదన్నారు.

తన మేలు, తన కుమారుడు మేలు తప్ప మరేమీ చంద్రబాబుకు అక్కర్లేదని వంశీ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు టీడీపీలో కాక రేపుతున్నాయి. జూనియర్‌ అభిమానులు వంశీ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News