ఎలా కెల‌కాలో త‌మ్ముళ్ల‌కు తెలీదా?

Update: 2018-03-24 08:36 GMT
రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల్లో ప‌దును చాలా అవ‌స‌రం. ఈ విష‌యంలో ఏ మాత్రం త‌ప్పు దొర్లినా దాని కార‌ణంగా జ‌రిగే న‌ష్టం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ చిన్న విష‌యాన్ని తెలుగు త‌మ్ముళ్లు అర్థం చేసుకోవ‌టం లేద‌న్న‌ట్లుగా ఉంది తాజా ప‌రిణామాలు చూస్తే. మొన్న‌టికి మొన్న అవ‌స‌రం లేకున్నా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని ఉద్దేశించి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఎంత ర‌చ్చ జ‌రిగిందో తెలిసిందే. చివ‌ర‌కు తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై విచారం వ్య‌క్తం చేయాల్సి ప‌రిస్థితి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కు ఎదురైందంటే ప‌రిస్థితి ఎలా మారిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా ఇదే త‌ర‌హాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నోరుపారేసుకున్నారు వ‌ర్ల‌ రామ‌య్య‌. ప‌వ‌న్ వెనుక ఎవ‌రు ఉండి ఆడిస్తున్నారో అంద‌రికి తెలుస‌న్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌న్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. జ‌న‌సేన దుకాణం బంద్ అవుతుంద‌న్నారు.

18 సీట్లు వ‌చ్చాక ప్ర‌జారాజ్యం మూసివేస్తూ చిరు నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. ప‌వ‌న్ కు మాత్రం చిరు తీసుకున్నంత టైం కూడా ప‌ట్ట‌దంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు.  రెండు పార్టీలు ఆందోళ‌న చేస్తున్నాయంటూ అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌ప‌కుండానే స‌భ‌ను వాయిదా వేస్తున్నార‌ని.. ఆందోళ‌న చేస్తున్న వారిని స‌భ నుంచి మార్ష‌ల్స్ తో బ‌య‌ట‌కు పంపొచ్చు క‌దా? అని ప్ర‌శ్నించారు.

స‌భ సాగ‌కుండా అడ్డుకునే వారిని బ‌య‌ట‌కు పంపి చ‌ర్చ జ‌రిగేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చ‌న్న వ‌ర్ల రామ‌య్య‌.. కేంద్రం చ‌ర్చ‌కు రాకుండా ఉండేందుకే అవిశ్వాసంపై న‌క్క‌జిత్తులు వేస్తుంద‌న్నారు. ఇలా మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు బాగానే ఉన్నా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి వ‌ర్ల లాంటోళ్లు తొంద‌ర‌ప‌డి వ్యాఖ్య‌లు చేయ‌టం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు.
Tags:    

Similar News