ఏపీలో రూ.8 కోట్ల క‌రెన్సీ నోట్ల‌తో దుర్గ‌మ్మ అలంక‌ర‌ణ‌.. ఎక్క‌డంటే!

Update: 2022-10-05 06:34 GMT
ద‌స‌రా నవరాత్రి ఉత్సవాలు దేశ‌వ్యాప్తంగా అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అమ్మ‌వారిని వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దారు. అంతేకాకుండా కోట్ల రూపాయ‌ల క‌రెన్సీ నోట్ల‌తో, బంగారు, వ‌జ్ర వైఢూర్యాలతో అమ్మ‌వారిని అలంక‌రిస్తున్నారు. ఈ రూపాలు అమ్మ‌వారి భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. మీడియాలోనూ వీటికి పెద్ద ఎత్తున ప్ర‌చారం ల‌భిస్తుండ‌టంతో మిగిలిన ప్రాంతాల్లోనూ దుర్గ‌మ్మను భారీ ధ‌న క‌న‌క వ‌స్తు వాహ‌నాల‌తో అలంక‌రిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి ఆలయాన్ని రూ.8 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వాహక కమిటీ గోడలు, నేలను రూ.3.5 కోట్ల కరెన్సీ నోట్లు, ఆభరణాలతో అలంకరించింది.

అదేవిధంగా 1 రూపాయి నుండి 2,000 రూపాయల వరకు వివిధ రకాల నోట్ల కట్టలు వాస‌వీ క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి మాత‌ చుట్టూ, నేలపై, గోడలకు అతికించారు. అంతేకాకుండా అమ్మ‌వారిని పెట్టిన మండ‌పం పైక‌ప్పును కూడా వ‌ద‌ల‌కుండా క‌రెన్సీ నోట్ల‌ను వేలాడ‌దీశారు.

135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ కమిటీ చెబుతున్న‌దాని ప్ర‌కారం..  అలంక‌రించిన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు భక్తుల నుండి వచ్చినవి. ఉత్సవాల తర్వాత వాటిని తిరిగి వారికి అందజేస్తారు.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దేవాలయాన్ని ఈ విధంగా అలంకరించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నెల్లూరు జిల్లాలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.5.16 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు.

రూ.2,000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 వంటి వివిధ రకాల కరెన్సీ నోట్లతో తయారు చేసిన ఓరిగామి పూల మాలలు, పుష్పగుచ్ఛాలతో నిర్వాహకులు అమ్మవారిని అలంకరించిన సంగ‌తి తెలిసిందే.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 'ధనలక్ష్మి' అవతారంలో ఉన్న దేవతను పెద్ద సంఖ్యలో భక్తులు పూజిస్తారు.

గతంలో తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రూ.1,11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు.

2017లో ఆలయ కమిటీ ఇదే తరహాలో రూ.3,33,33,333 కరెన్సీ నోట్లతో నైవేద్యాన్ని సమర్పించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News